కలం, బాసర: గోదావరి పుష్కరాల (Godavari Pushkaralu) కు బాసర (Basara) కు వచ్చే భక్తులందరికీ అన్ని సదుపాయాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Collector Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు. గురువారం బాసరలో పుష్కరాల పనులను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల పార్కింగ్, వీఐపీ, వీవీఐపీల పార్కింగ్, హెలిప్యాడ్ నిర్మించనున్న ప్రదేశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలని సూచించారు. వాహనాల రాకపోకల సామర్థ్యానికి అనుగుణంగా పార్కింగ్ స్థలాలను ఆయా మార్గాలవారీగా ఏర్పాటు చేయాలన్నారు. ఇతర మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తుల అవసరాల మేరకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. సంబంధిత అధికారులు అంతా పుష్కరాల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలని హెచ్చరించారు. అనంతరం నూతన తహశీల్దార్ కార్యాలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. ఈ పరిశీలనలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఈఈ ఆర్అండ్ బి సుభాష్, తహశీల్దార్ పవన్ చంద్ర, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

