కలం, వెబ్డెస్క్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ ఏసీబీ (ACB)కి చిక్కిన మాజీ డీఎస్పీ భీమ్ రెడ్డి (Bheem Reddy) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏసీబీ అధికారులు గురువారం భీమ్ రెడ్డికి సంబంధించిన 8 మంది అనుమానిత బినామీలను గుర్తించారు. ఈ మేరకు హైదరాబాద్లోని పుప్పాలగూడలో ఉన్న వారి నివాసాలలో అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. బినామీ ఆస్తుల ఆరోపణలపై దర్యాప్తు మరింత తీవ్రతరం కావడంతో, అధికారులు ప్రస్తుతం వారి ఇళ్లలో ఆస్తులు, ఆస్తి పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పలువురి ఇళ్లల్లో కోట్లాది నగదు, ఆస్తుల పత్రాలు, నగలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

