కలం, స్పోర్ట్స్ : ఆసియా క్రీడల్లో(Asian Games 2026) భారత వుషూ స్టార్ రోషిబినా దేవి (Roshibina Devi) మరోసారి సత్తా చాటింది. మహిళల 60 కేజీల సాండా విభాగంలో రజత పతకం (Silver Medal) సాధించింది. దీంతో ఆసియా క్రీడల్లో ఈ విభాగంలో వరుసగా రెండోసారి రజతం గెలిచిన ఘనతను సొంతం చేసుకుంది. గురువారం జరిగిన ఫైనల్లో చైనాకు చెందిన జాంగ్ షియాయూ చేతిలో రోషిబినా పరాజయం పాలైంది. రెండు రౌండ్లలోనూ 0-5తో వెనుకబడటంతో పోరాటం రెండు రౌండ్లలోనే ముగిసింది.
అంతకుముందు సెమీఫైనల్లో ఇండోనేషియాకు చెందిన థానియా కుసుమనింగ్టియాస్‌పై 2-0తో విజయం సాధించింది. టోర్నీలో డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ వియత్నాంకు చెందిన న్గుయెన్ థి తు థుయ్‌పై కూడా రోషిబినా విజయం సాధించింది. 2022 హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లోనూ రోషిబినా దేవి రజత పతకం గెలిచింది. తాజాగా మరోసారి రజతం సాధించి వరుసగా రెండు ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన భారత క్రీడాకారిణిగా నిలిచింది. తాజా రజతంతో ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 14కు చేరింది. ఇందులో ఒక స్వర్ణం, ఆరు రజతాలు, ఏడు కాంస్య పతకాలు ఉన్నాయి.

