కలం, నల్లగొండ: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్లీ విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని.. 2014 కంటే ముందున్న చీకటి రోజులు పునరావృతమవుతున్నాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నల్లగొండ జిల్లా దామరచర్ల పరిధిలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇళ్లకు విద్యుత్ కోతలు విధించడం, పరిశ్రమలకు కోతలు పెట్టి జనరేటర్లు వాడేలా చేయడం, చివరకు రైతులు పొలాలకు నీళ్లు పారించుకోవడానికి డీజిల్ జనరేటర్లు వాడాల్సిన దుస్థితికి ప్రభుత్వాన్ని నెట్టారని మండిపడ్డారు.
యాదాద్రి వద్ద నిర్మిస్తున్న 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ దేశంలోనే అతిపెద్దదని, ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ నిబద్ధతకు, కేసీఆర్ మార్గదర్శకత్వానికి నిదర్శనమని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. తమ పాలనలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 6,700 మెగావాట్ల నుంచి ఏకంగా 21,500 మెగావాట్లకు పెంచామని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతోనే యాదాద్రి ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసిందని, ఆ నెపాన్ని ‘బొగ్గు కొరత’పై నెట్టడానికి చూస్తోందని.. ఆ కారణాలన్నీ పచ్చి అబద్ధాలని కొట్టిపారేశారు.
40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్..
తెలంగాణలోని సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ, ఇక్కడి రైతులకు కనీసం 6 గంటల విద్యుత్ కూడా సరిగ్గా ఇవ్వడం లేదని జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ విద్యుత్ నిర్వహణ వెనుక ఏకంగా 40 లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని ఆయన సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి ప్లాంట్‌ను కావాలనే విఫలం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నుతోందని, క్షేత్రస్థాయిలోని అధికారులు సైతం ప్లాంట్ పరిస్థితి చూసి ఆవేదన చెందుతున్నారని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు, బొగ్గు కుంభకోణాలు, ఇతర స్కామ్‌లను ఒక్కొక్కటిగా ఆధారాలతో సహా బయటకు తీస్తామని మాజీ మంత్రి హెచ్చరించారు. “కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రతి అక్రమానికి అన్ని లెక్కలు కక్కిస్తాం.. ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అని ఘాటుగా హెచ్చరించారు. ప్రజా వ్యతిరేక విధానాలను తక్షణమే వీడకపోతే ప్రజలే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

