కలం, వెబ్ డెస్క్ : ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కు సుప్రీం కోర్టులో గట్టి షాక్ తగిలింది. దానం నాగేందర్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఆయనపై నమోదైన అనర్హత వేటును సమర్థిస్తూ గతంలో హైకోర్టు వెల్లడించిన ఉత్తర్వులను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించి, దానం పిటిషన్‌ను కొట్టివేసింది. దానం నాగేందర్ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహతగీ కోర్టులో వాదనలు వినిపించారు.
అనర్హత వేటు పడటంతో ఆయన (Danam Nagender) మళ్లీ ప్రజాక్షేత్రానికి వెళ్లి ఎన్నికలను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోర్టు స్పష్టత ఇవ్వడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక ఖరారైంది. ఈ క్రమంలో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి రాష్ట్ర సీఈఓ కార్యాలయానికి అధికారిక నోట్ పంపడం, అనంతరం గెజిట్ ప్రకటన వెలువడే ప్రక్రియ ఊపందుకుంది.
ఈ గెజిట్ ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం (EC) త్వరలోనే ఉప ఎన్నిక ప్రకటన విడుదల చేయనుంది. నిబంధనల ప్రకారం అసెంబ్లీ స్థానం ఖాళీగా ప్రకటించిన నాటి నుంచి ఆరు నెలల వ్యవధి లోపు ఉప ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన వచ్చే ఏడాది మార్చి మధ్య నాటికి ఖైరతాబాద్ ఉప ఎన్నికల (Khairatabad Bypoll) ఘట్టం పూర్తిగా ముగియనుంది.
Also Read : తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు
Follow Us On: X(Twitter)

