కలం, జగిత్యాల: జగిత్యాల (Jagtial) జిల్లాలోని ఎండపల్లి (Endapalli) మండలం కొత్తపేట గ్రామంలో గణేశ్ నిమజ్జన వేడుకలు తీవ్ర విషాదాన్ని నింపాయి. బుధవారం రాత్రి ఊరేగింపు, నిమజ్జన ఏర్పాట్లలో ఉత్సాహంగా పాల్గొన్న గ్రామానికి చెందిన కొప్పుల రాజశేఖర్ (23) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గణేశ్ విగ్రహ నిమజ్జన ఊరేగింపుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో సౌండ్ సిస్టమ్ బాక్సులకు విద్యుత్ సరఫరా అందించే మెయిన్ వైర్లు అడ్డుగా ఉండటంతో, రాజశేఖర్ ఒక కర్ర సహాయంతో వాటిని సరిచేసేందుకు ప్రయత్నించాడు. అయితే, ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్ల నుంచి తీవ్ర స్థాయిలో విద్యుత్ ప్రసారమవ్వడంతో రాజశేఖర్ విద్యుత్ షాక్‌కు గురయ్యాడు.
తోటి యువకులు, గ్రామస్థులు వెంటనే స్పందించి కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ షాక్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో రాజశేఖర్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. ఉత్సాహంగా సాగుతున్న వేడుకల్లో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరగడంతో కొత్తపేట గ్రామంలో శోకసంద్రం అలుముకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. నిండు నూరేళ్ల భవిష్యత్తు ఉన్న యువకుడు విద్యుత్ ప్రమాదంలో బలవ్వడంతో రాజశేఖర్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

