కలం, భైంసా: ఒకప్పుడు భైంసా (Bhainsa) పేరు వినగానే సున్నిత ప్రాంతంగా గుర్తుకొచ్చేది. చిన్న ఘటన జరిగినా ఉద్రిక్తతలకు దారితీసిన సందర్భాలుండేవి. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. అదే భైంసా.. అదే ప్రజలు.. అయితే ఆలోచనలో మాత్రం మార్పు కనిపిస్తోంది. పండుగ ఏదైనా.. కలిసి జరుపుకుందాం.. సంతోషాన్ని పంచుకుందాం అంటూ హిందూ, ముస్లింలు సోదరభావంతో ముందుకు సాగుతున్నారు.
మున్సిపల్ ఎన్నికల నుంచే ఐక్యతకు బీజం..
గత మున్సిపల్ ఎన్నికల్లో హిందూ, ముస్లిం కౌన్సిలర్లు కలిసి దత్తాద్రిని చైర్మన్‌గా, బీబీ ఖుతిజా సిద్ధిఖ్‌ను వైస్ చైర్మన్‌గా ఎన్నుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాజకీయాల్లోనూ పరస్పర సహకారం సాధ్యమేనన్న సంకేతాన్ని ఇది ఇచ్చింది.
ఇఫ్తార్‌కు హాజరైన హిందువులు
రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులకు హిందువులు హాజరై సోదరభావాన్ని చాటారు. ఒకరి పండుగను మరొకరు గౌరవించుకోవాలన్న సంప్రదాయం భైంసాలో మరింత బలపడింది.
గణేష్ మండపాల్లో ఇద్రిస్ బేగ్ సందడి
ఇదే స్ఫూర్తి గణేష్ నవరాత్రి ఉత్సవాల్లోనూ కనిపించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భర్త ఇద్రిస్ బేగ్ గణేష్ మండపాల నిర్వాహకులతో కలిసి నిమజ్జన వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. మండపాలను సందర్శిస్తూ నిర్వాహకులతో కలిసిపోయారు. నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అందరినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగారు. నిమజ్జన శోభాయాత్రలో మండపాల నిర్వాహకులు ఏర్పాటు చేసిన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే వాటిపై ఇద్రిస్ బేగ్ ఫొటోలను ప్రదర్శిస్తూ యువత నృత్యాలు చేయడం మరింత ఆసక్తిని రేకెత్తించింది. గణేష్ నిమజ్జన వేడుకల్లో ముస్లిం సోదరుడి భాగస్వామ్యాన్ని ఇది ప్రతిబింబించింది.
పోలీసులకు కనిపించిన కొత్త భైంసా
గతంలో సున్నిత ప్రాంతంగా గుర్తించిన భైంసాలో ఈసారి గణేష్ నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా సాగడం, రెండు వర్గాల ప్రజలు పరస్పరం సహకరించుకోవడం ప్రత్యేకంగా కనిపించింది. ఐక్యంగా ఉంటే పండుగలు మరింత ఆనందంగా జరుగుతాయనే సందేశం ఈ వేడుకల ద్వారా వెలువడింది.
పండుగలు వేరు.. ఆనందం ఒక్కటే..
రంజాన్‌లో ఇఫ్తార్ విందులు.. గణేష్ నిమజ్జనంలో భాగస్వామ్యం.. ఇలా పండుగలు వేరైనా సంతోషాన్ని పంచుకోవడంలో భైంసా ప్రజలు ఒక్కటవుతున్నారు. రాబోయే రోజుల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని పండుగలను కలిసిమెలిసి జరుపుకుంటే భైంసాను మతసామరస్యానికి చిరునామాగా నిలపాలనే ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

