కలం, మహబూబ్‌నగర్ బ్యూరో : సాగునీటి కోసం పాలమూరు ప్రజలు మరోసారి పోరుబాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన సమితి జేఏసీ పేర్కొంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా జిల్లాల మధ్య సాగునీటి వివాదాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. డిండి ఎత్తిపోతల పథకం(Dindi Lift Irrigation Project) ద్వారా కృష్ణా జలాలను నల్గొండ జిల్లాకు తరలించడం వల్ల పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని జేఏసీ ఆరోపించింది.
డిండి రిజర్వాయర్ ద్వారా కృష్ణా జలాలను పెద్ద ఎత్తున నల్గొండ జిల్లాకు మళ్లించేందుకు ఆ జిల్లా నేతలు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకొస్తున్నారని, వారి ఒత్తిడికి ప్రభుత్వం లొంగి డిండి ప్రాజెక్టును చేపట్టిందని జేఏసీ ఆరోపించింది. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు జరుగుతున్న నేపథ్యంలో డిండి ప్రాజెక్టుకు నీటిని తరలిస్తే పాలమూరు రైతుల ప్రయోజనాలకు నష్టం కలుగుతుందని పేర్కొంది.
ప్రాజెక్టు నిర్మాణానికి పర్యావరణ అనుమతుల అంశం కూడా వివాదానికి కారణమైందని జేఏసీ తెలిపింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించడం పనులకు ఆటంకంగా మారిందని పేర్కొంది. అయితే తాగునీటి అవసరాల కోసమే ప్రాజెక్టును చేపడుతున్నామని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోందని తెలిపింది. ప్రస్తుతం నల్గొండ, పాలమూరు జిల్లాల మధ్య నెలకొన్న వివాదం కేవలం నీటి పంపకాల అంశం మాత్రమే కాకుండా ప్రాంతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా మారిందని జేఏసీ పేర్కొంది. ప్రభుత్వం సాంకేతిక అంశాలపై స్పష్టతనిస్తూ, నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఏదుల రిజర్వాయర్ నుంచి నీటి విడుదలకు సంబంధించి రెండు జిల్లాల రైతులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపాలని డిమాండ్ చేసింది.
డ్రాయల్ లెవల్ మార్పుపై అభ్యంతరం
డిండి ప్రాజెక్టుకు అవసరమైన నీటిని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని ఏదుల (వీరాంజనేయ) రిజర్వాయర్ నుంచి తీసుకోవాల్సి ఉందని జేఏసీ పేర్కొంది. తొలుత 437 మీటర్ల మట్టం నుంచి నీటిని తీసుకునేలా ప్రణాళిక రూపొందించారని, దీనివల్ల 60 రోజుల్లో 30 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేదని తెలిపింది. అయితే డ్రాయల్ లెవల్‌ను 440 మీటర్లకు మార్చడంతో నీటి లభ్యత సమయం తగ్గిపోతుందని పేర్కొంది. దీనివల్ల డిండికి 30 టీఎంసీలకు బదులుగా కేవలం 8 నుంచి 10 టీఎంసీల నీరు మాత్రమే వచ్చే ప్రమాదం ఉందని ఇంజనీర్లు, నల్గొండ నాయకులు ఆరోపిస్తున్నారని తెలిపింది. ఆశించిన 6,000 క్యూసెక్కుల నీటికి బదులుగా కేవలం 1,500 క్యూసెక్కుల నీరు మాత్రమే అందే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది.
ఫ్లోరైడ్ సమస్యపై నల్గొండ వాదన
నల్గొండ (Nalgonda) జిల్లా వాసుల ప్రకారం డిండి ప్రాజెక్టు దశాబ్దాలుగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం చూపుతుందని జేఏసీ తెలిపింది. దేవరకొండ, మునుగోడు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు జీవనాధారమని వారు పేర్కొంటున్నారని తెలిపింది. ఫ్లోరైడ్ నివారణకు కీలకమైన శివన్నగూడెం రిజర్వాయర్ నిండాలంటే పూర్తి స్థాయిలో నీటిని తరలించాల్సి ఉంటుందని, ప్రస్తుత మార్పులతో అది సాధ్యం కాదని స్థానిక నేతలు వాదిస్తున్నారని పేర్కొంది.
‘మా నీళ్లు మాకే’
మరోవైపు పాలమూరు జిల్లా వాసులు డిండి ప్రాజెక్టు డిజైన్‌పై మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారని జేఏసీ తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కోసం కేటాయించిన నీటిలో నుంచి డిండికి నీటిని మళ్లించడం వల్ల కల్వకుర్తి, ఇతర ప్రాంతాల రైతులకు అన్యాయం జరుగుతుందని వారు ఆందోళన చెందుతున్నారని పేర్కొంది. కేవలం వరద సమయంలో లభించే మిగులు జలాలను మాత్రమే వినియోగిస్తామని చెబుతున్నప్పటికీ, వాస్తవంగా తమ వాటా నీటికి గండి పడుతుందని పాలమూరు రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారని తెలిపింది.
డిండి ఎత్తిపోతల పథకానికి ఆర్. విద్యాసాగర్‌రావు పేరు పెట్టినప్పటికీ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని జేఏసీ పేర్కొంది. రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ నత్తనడకన సాగుతోందని, నష్టపరిహారం కోసం నిర్వాసితులు పలుమార్లు ఆందోళనలు చేపట్టారని తెలిపింది. రూ.1,788.89 కోట్లతో ఏదుల–డిండి అలైన్‌మెంట్ అంచనాలను ప్రభుత్వం సిద్ధం చేసిందని జేఏసీ పేర్కొంది. కేబినెట్ ఆమోదం, పరిపాలనా అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపింది. ఇదే సమయంలో డిండి ప్రాజెక్టు ద్వారా తరలించే నీటికి సంబంధించి నల్గొండ జిల్లాలో ఇప్పటికే రిజర్వాయర్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోందని పేర్కొంది.
295 రోజులుగా రిలే నిరాహార దీక్షలు
డిండి ఎత్తిపోతల పథకాన్ని ఎలాగైనా అడ్డుకుని తీరుతామని మహబూబ్‌నగర్ పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ స్పష్టం చేసింది. కల్వకుర్తి నియోజకవర్గం చారకొండ మండల పరిధిలోని ఉలపర గ్రామంలో 295 రోజులుగా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నట్లు జేఏసీ నేతలు తెలిపారు. ఈ నెల 27వ తేదీతో దీక్షలు 300 రోజులు పూర్తి చేసుకుంటాయని, ఈ సందర్భంగా ఉలపర గ్రామం నుంచి కల్వకుర్తి వరకు మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
డిండి ఎత్తిపోతల పథకం (Dindi Lift Irrigation Project) ద్వారా పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, కృష్ణా నది జలాలను నల్గొండ జిల్లా ప్రజలు అధికంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని జేఏసీ నేతలు ఆరోపించారు. రాష్ట్రాల మధ్య పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు జిల్లాల మధ్య పోరాటాలు చేసే పరిస్థితి రాకుండా ప్రజాప్రతినిధులు వ్యవహరించాలని జేఏసీ నేతలు కోరారు. సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు సమాయత్తమవుతారని హెచ్చరించారు.
Also Read : బోరు ఎండింది.. నల్లా నీరే దిక్కైంది..!
Follow Us On: X(Twitter)

