ఘోర రోడ్డు ప్రమాదం.. బీజేపీ నాయకురాలు సులోచన దుర్మరణం

​కలం, కరీంనగర్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ వ్యాన్ బైక్‌ను ఢీకొట్టిన ఈ దుర్ఘటనలో చెల్పూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకురాలు కొంకటి సులోచన (Konkati Sulochana) అక్కడికక్కడే మృతి చెందగా, ఆమె భర్త రమేష్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం.. చెల్పూర్ గ్రామానికి చెందిన దంపతులు కొంకటి రమేష్, సులోచనలు తమ ద్విచక్ర వాహనంపై ఓ ప‌ని నిమిత్తం పెద్దపాపయ్యపల్లికి వెళ్లారు. అక్కడ పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో, వెనుక నుంచి అతివేగంతో వచ్చిన ఒక డీసీఎం వ్యాన్ వారి బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

​ఈ ప్రమాదంలో సులోచన రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడిన ఆమె భర్త రమేష్‌ను స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదంపై సమాచారం అందుకున్న హుజూరాబాద్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. సులోచన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

​గ్రామంలో విషాదఛాయ‌లు

సులోచన గత స్థానిక సంస్థల ఎన్నికల్లో చెల్పూర్ గ్రామ సర్పంచ్ పదవికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆమె భర్త రమేష్ ప్రస్తుతం బీజేపీ ఎస్సీ సెల్ మండల నాయకుడిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. సులోచన అకస్మాత్తుగా మృతి చెందడంతో చెల్పూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. నాయకులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>