కలం, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు రకరకాల సమస్యలపై ఫిర్యాదులు, వినతిపత్రాలు అందించగా.. వెంటనే స్పందించారు. అక్కడికక్కడే పరిష్కారాలు చూపడమే కాకుండా, నిధుల మంజూరు ఆదేశాలు జారీ చేశారు. గొల్లప్రోలు మున్సిపాలిటీలో స్వయంగా తనిఖీలు చేపట్టిన పవన్ కళ్యాణ్ డ్రైనేజీలు పొంగి ఇళ్లల్లోకి వస్తున్నట్లు గుర్తించారు. ఇందు కోసం రూ.4.5 కోట్లు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేయడంతో వెంటనే టెండర్లు పిలవాలని సూచించారు. అలాగే, మున్సిపాలిటీలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం జేసీబీ అవసరం ఉందని అధికారులు వివరించారు. అందుకోసం రూ.25 లక్షలు మంజూరు చేశారు.
ఆలయాలకు రూ.1.50 కోట్లు..
నియోజకవర్గంలోని వివిధ ఆలయాల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. విరవలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం, కోనేరు పనుల కోసం రూ.కోటి, కొండేవరం రామాలయానికి రూ.25 లక్షలు, ఫక్రద్దీన్ పాలెంలో ఉన్న సుబ్రహ్యణ్యేశ్వర స్వామి, కనకదుర్గ అమ్మవారి ఆలయాలకు రూ.25 లక్షలు కేటాయించారు. అలాగే అమరవిల్లి, కొమరగిరి, గోర్స, నవఖండ్రవాడ, చేబ్రోలు, దుర్గాడ గ్రామాల పంచాయతీ భవనాలకు రూ.1.92 కోట్లు నిధులు ఇస్తామని ప్రకటించారు. ఒక్కో పంచాయతీ భవనానికి రూ.32 లక్షలు కేటాయిస్తున్నట్లు గ్రామస్థులకు తెలిపారు. కొండెవరం గ్రామంలో విద్యుత్తు సమస్యలకు వెంటనే పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న లైన్లను తొలగించాలన్నారు.
రాజమండ్రికి బస్సు సర్వీస్..
పిఠాపురం నుంచి రాజమండ్రికి బస్సు సర్వీస్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో మాట్లాడారు. వెంటనే బస్సు సర్వీసులు ప్రారంభించాలని ఆదేశించారు. వీటితో పాటు అనేక గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి వినతిపత్రాలు స్వీకరించిన పవన్ కళ్యాణ్.. అక్కడికక్కడే నిధులు మంజూరు చేసి, పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. చాలా రోజుల తరువాత సొంత నియోజకవర్గానికి వచ్చిన పవన్ కళ్యాణ్ పెండింగ్ పనులపై సుదీర్ఘంగా సమీక్ష జరిపారు.

