కలం, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ రిమ్స్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన (Adilabad RIMS Fire) లో మృతి చెందిన చిన్నారుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ పరిహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారని కలెక్టర్ పేర్కొన్నారు.
జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న చిన్నారుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారని తెలిపారు. అవసరమైతే చిన్నారులను హైదరాబాద్‌లోని కార్పొరేట్, ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య చికిత్స అందించాలని మంత్రి అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు.
అదేవిధంగా రిమ్స్‌లో 150 పడకల సామర్థ్యంతో మాతా శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్) నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించనున్నట్లు మంత్రి ప్రకటించారని కలెక్టర్ తెలిపారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఎంసీహెచ్ నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన పేర్కొన్నారు. చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత వైద్యాధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు.

