కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన యువతి హరిణి మృతి కేసులో దర్యాప్తును వేగవంతం చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించాలని, ఈ కేసుపై రేపు సాయంత్రంలోగా పూర్తి నివేదిక సిద్ధం చేయాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
బుధవారం మారేళ్ళపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవ కార్యక్రమం ముగించుకుని ఖమ్మం వెళ్తున్న క్రమంలో, జూలూరుపాడు వద్ద హరిణికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు చేపట్టిన రాస్తారోకో వద్ద మంత్రి తుమ్మల ఆగి మాట్లాడారు. బాధితుల ఆవేదనను ఆలకించిన ఆయన వెంటనే జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్‌తో ఫోన్లో సంభాషించారు.
యువతి మృతికి కారణమైన వారిని 24 గంటల్లోగా గుర్తించి, కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేసు విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, రేపు సాయంత్రంలోగా పూర్తి రిపోర్ట్ అందజేయాలని తేల్చి చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగిందని స్థానికులు తెలిపారు.

