కలం, వెబ్‌డెస్క్: బ్రెజిల్‌లో వరుస హత్యలకు (Brazil Serial Killer) పాల్పడుతున్న దోమను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దోమ ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 16 హత్యలు చేసినట్లు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. దోమ (The Mosquito) పేరుతో వైరల్‌గా మారిన మోస్ట్ వాంటెడ్ హంతకుడు జోర్లాన్ లోప్స్ దా సిల్వా (Jorlan Lopes da Silva)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జోర్లాన్ గత మూడు నెలల్లోనే 16 మందిని హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ సీరియల్ కిల్లర్ గడిచిన 20 ఏళ్లలో డజన్ల కొద్ది హత్యలు చేసినట్లు అనుమానాలున్నాయి. సన్నటి శరీరాకృతి కారణంగా స్థానికులు అతడిని ది మస్కిటో అని పిలుస్తుంటారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అతడు గత కొన్ని సంవత్సరాలుగా అడవుల్లో తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేసుకుని తలదాచుకుంటూ వచ్చాడు.
పోలీసుల గాలింపు తీవ్రం కావడంతో పరారయ్యేందుకు దోమ వినూత్న ప్రయత్నం చేశాడు. పోలీసుల కళ్లుగప్పేందుకు ఏకంగా మహిళలాగా వేషధారణ మార్చుకున్నాడు. నల్లటి గీతలున్న దుస్తులు, విగ్గు, నెయిల్ పాలిష్ ధరించి, కళ్లద్దాలు పెట్టుకుని, తనకు ఏమాత్రం సంబంధం లేని రెండేళ్ల చిన్నారితో కలిసి ప్రయాణిస్తుండగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అడవిలోని తన టెంట్ వద్దకు చేరుకోలేక నిరాశలో ఈ విచిత్ర వేషధారణ మార్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
అయితే తాను కేవలం నేరస్థులనే టార్గెట్‌గా చేసుకొని దాడులు చేశానని దోమ పోలీసుల ఎదుట చెప్పినట్లు సమాచారం. కానీ, అతడి వాదనను పోలీసులు కొట్టిపారేస్తున్నారు. తన పదమూడేళ్ల వయస్సు నుంచే హత్యలు చేయడం ప్రారంభించానని, తన జీవిత కాలంలో దాదాపు 80 మందిని హతమార్చానని నిందితుడు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. ప్రస్తుతం అతడు చెప్తున్న హత్యలపై పోలీసులు లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు.

