కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వినాయక విగ్రహాల నిమజ్జనం (Ganesh Immersion) ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించడానికి ప్రజలంతా సహకరించాలని మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు (DSP Venkateshwarlu) కోరారు. జిల్లా ఎస్పీ డి.జానకి ఆదేశాల మేరకు పట్టణంలో వినాయక నిమజ్జన కార్యక్రమాలను నిర్వహించే నిర్వాహకులు, భక్తులు ప్రజలకు ఆయన పలు సూచనలు చేశారు. డీజేలకు అనుమతి లేదని డీఎస్సీ స్పష్టం చేశారు. అధిక శబ్దం వల్ల వృద్ధులు, చిన్నారులు, అనారోగ్యంతో ఉన్నవారు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందునా నిబంధనలు తప్పక పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
నీటిలో లోతుకు వెళ్లకూడదన్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పాటిస్తూ ప్రమాదకర ప్రదేశాల్లోకి వెళ్లకుండా అధికారుల సూచనలు తప్పక పాటించాలని చెప్పారు. నిమజ్జనం ఊరేగింపులో విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలకు దూరంగా ఉంటూ అప్రమత్తంగా ఉంటూ ప్రమాదాలకు తావివ్వకూడదని సూచించారు. అలాగే, మద్యం సేవించి వాహనాలు నడపకుండా వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
నిమజ్జనం వేళ ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించకూడదన్నారు. మత, కుల, వర్గ, ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే ప్రచారాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపించినా వెంటనే స్థానిక పోలీసులకు, జిల్లా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659360 లేదా 112 కి సమాచారం అందించాలన్నారు.

