కలం, వెబ్ డెస్క్ : పాలమూరు ప్రాంత రైతు ప్రయోజనాలను కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన దౌత్య యత్నాలు ఫలించాయి. తెలంగాణ రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల బృందం బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌తో ప్రత్యేకంగా సమావేశమైంది. దక్షిణ తెలంగాణలో పంటల సాగు నీటి అవసరాలను, ఆయకట్టు ప్రాంతంలో ఎదురవుతున్న నీటి ఎద్దడిని మంత్రులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
పాలమూరు రీజియన్ పరిధిలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల కింద సుమారు 5.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. ప్రస్తుతం పంటలు చివరి దశకు చేరుకున్నందున వెంటనే నీటిని విడుదల చేయాలని, వచ్చే ఒక నెల రోజుల పాటు నిరంతరాయంగా ప్రతిరోజూ 5,000 క్యూసెక్కుల చొప్పున (మొత్తం 5 టిఎంసిలు) కృష్ణా నీటిని (Krishna Water) నారాయణపూర్ జలాశయం నుండి విడుదల చేయాలని తెలంగాణ ప్రతినిధి బృందం కోరింది.
తెలంగాణ నేతల విజ్ఞప్తిపై కర్ణాటక సీఎం డి.కె. శివకుమార్ సానుకూలంగా స్పందించారు. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కృష్ణా జలాలు విడుదల చేయడానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. ఈ మేరకు నీటి విడుదల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కర్ణాటక హామీతో తెలంగాణ అధికారులు కూడా ముందస్తుగా జూరాల ప్రాజెక్టు కాలువలకు నీటిని విడుదల చేసి రైతులకు బిగ్ రిలీఫ్ ఇచ్చారు.
Also Read : ఆసియా క్రీడల్లో మీరాబాయి చానుకు రజతం
Follow Us On : WhatsApp

