‘వరంగల్ సూపర్ స్పెషాలిటీ’ ప్రారంభ గడువుపై సందిగ్ధత

కలం, వరంగల్‌ బ్యూరో: ఉత్తర తెలంగాణ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో నిర్మించే వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి (Warangal Hospital) ప్రారంభం మళ్లీ ప్రశ్నార్థకంగా మారింది. ఆస్పత్రిని రూ.1,100 కోట్ల అంచనాతో చేపట్టగా.. తర్వాత రూ.1,371 కోట్లకు చేరింది. 24 అంతస్తులు, 2,018 పడకలు, 35 ఆపరేషన్‌ థియేటర్లతో నిర్మిస్తుండగా భవనం పనులు తుది దశకు చేరాయి. అయితే.. వైద్య పరికరాలు, విద్యుత్‌, నీటి సరఫరా, శానిటేషన్‌, టెక్నికల్ పనులు పూర్తి కాలేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన దసరా నాటికి ప్రారంభ గడువుపై సందిగ్ధత నెలకొంది.

ఐదేళ్ల కిందట చేపట్టగా..

2021లో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రికి అప్పటి ప్రభుత్వం రూ.1,100 కోట్లకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. ఇందులో సివిల్‌ పనులతో పాటు మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ప్లంబింగ్‌, నీటి సరఫరా, శానిటేషన్‌, వైద్య పరికరాలు, ఇతర అనుబంధ పనులకు కేటాయింపు చేసింది. అనంతరం ప్రాజెక్టు అంచనా వ్యయం పెరిగి రూ.1,371 కోట్లకు చేరింది. సుమారు 19.70 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కోసం 186 నివాస యూనిట్లు, రోగుల సహాయకుల కోసం ధర్మశాల గదులు, ఆడిటోరియం, కిచెన్‌, లాండ్రీ, మార్చురీ, యుటిలిటీ బ్లాక్‌ తదితర సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

భవనం ఒక్కటే పూర్తయితే ఎలా?

ఆస్పత్రి భవన నిర్మాణం పూర్తయినంత మాత్రాన వైద్య సేవలు ప్రారంభించే పరిస్థితి ఉండదు. ఆస్పత్రి కార్యకలాపాలకు అవసరమైన వైద్య పరికరాల ఏర్పాటు, విద్యుత్‌ వ్యవస్థలు, నీటి సరఫరా, శానిటేషన్‌, ప్లంబింగ్‌, ఇతర మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ పనులు పూర్తికావాల్సి ఉంది. పరికరాలను ఏర్పాటు చేసి వాటి పనితీరును పరీక్షించడంతో పాటు విభాగాల వారీగా ట్రయల్‌ రన్‌ నిర్వహించాల్సి ఉంటుంది. వైద్యులు, నర్సులు, టెక్నీషియన్లు, ఇతర సిబ్బంది అందుబాటులో ఉండటం కూడా సేవల ప్రారంభానికి కీలకం. ఓపీ, ఇన్‌పేషెంట్‌, అత్యవసర సేవలు, ఆపరేషన్‌ థియేటర్ల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా సిద్ధం కావాల్సి ఉంది.

దసరా గడువు.. పనులపై ఒత్తిడి

ఆస్పత్రిని దసరా నాటికి అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, మిగిలిన పనుల ఫురోగతిపై తాజాగా ఉన్నతస్థాయి సమీక్షలు జరుగుతున్నాయి. ఇటీవల వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ ఆస్పత్రి పనులను పరిశీలించి వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి కూడా పనుల పురోగతిపై సమీక్షించి, తదుపరి 30 రోజులపాటు 24 గంటలూ పనులు కొనసాగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రత్యేక సమన్వయంతో పనులను పర్యవేక్షించాలని సూచించారు. దీంతో నిర్ణీత గడువులోగా మిగిలిన పనులు పూర్తి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు స్పష్టమవుతోంది.

ఇప్పటికే మారిన గడువులు

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి గతంలోనూ పలుమార్లు ప్రారంభ గడువులు తెరపైకి వచ్చాయి. నిర్మాణ పనుల పురోగతిలో జాప్యం కారణంగా ప్రారంభ తేదీపై స్పష్టత లేకుండా పోయింది. తాజాగా అధికారులు అక్టోబర్‌ నాటికి మిగిలిన పనులు పూర్తి చేసి, నవంబర్‌లో ట్రయల్‌ రన్‌ నిర్వహించి, డిసెంబర్‌లో వైద్య సేవలు ప్రారంభించేలా కార్యాచరణ రూపొందించినట్లు వెల్లడించారు. ఇదే సమయంలో ప్రభుత్వం దసరా నాటికి ప్రారంభిస్తామని చెబుతుండటంతో గడువులపై స్పష్టత అవసరమవుతోంది.

వైద్య సేవలపై ప్రజల నిరీక్షణ

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి అందుబాటులోకి వస్తే ఉమ్మడి వరంగల్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలకు అత్యున్నత వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయి. సంక్లిష్ట వ్యాధుల చికిత్సలకు హైదరాబాద్‌ వంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం కొంత మేర తగ్గుతుంది. భారీగా నిధులు వెచ్చించిన ప్రాజెక్టులో మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి, అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో సిద్ధం చేసి సేవలు ఎప్పుడు ప్రారంభిస్తారనేదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>