కలం, నేషనల్ డెస్క్ : దేశంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) క్యాంపస్‌లలో విద్యార్థుల మరణాల (IIT Student Suicides) సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. గత ఐదేళ్ల కాలంలో (2020-21 నుంచి 2024-25 మధ్య) వివిధ ఐఐటీల్లో కనీసం 53 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఉన్నత విద్యా శాఖ సేకరించిన గణాంకాల ప్రకారం.. ఈ మరణాలలో సగానికి పైగా అంటే 54.7 శాతం (29 మంది) విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వంటి వెనుకబడిన వర్గాలకు చెందినవారే.
మొత్తం మరణాల్లో 45 ఆత్మహత్యలు ఉండగా, 8 అసాధారణ మరణాలు ఉన్నాయి. ఐఐటీ ఖరగ్పూర్, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ హైదరాబాద్లో ఈ ఐదేళ్లలో ఏడేసి చొప్పున మరణాలు నమోదయ్యాయి. ముఖ్యంగా ఐఐటీ హైదరాబాద్లో నమోదైన ఏడు మరణాలూ ఆత్మహత్యలే కావడం గమనార్హం. అలాగే ఐఐటీ కాన్పూర్, ఐఐటీ (బీహెచ్ యూ) వారణాసిలలో ఆరేసి చొప్పున, ఐఐటీ మద్రాస్లో ఐదుగురు విద్యార్థులు మృతి చెందారు.
ఏడాదికేడాది పెరుగుతున్న మరణాలు
ఐఐటీ క్యాంపస్‌లలో మరణాల సంఖ్య ఏడాదికేడాది పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తున్నది. 2020-21లో 5 మరణాలు నమోదు కాగా, 2021-22లో 6, 2022-23లో 6 చొప్పున మరణాలు సంభవించాయి. ఆ తర్వాతి కాలంలో ఈ సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరింది. 2023-24లో మరణాల సంఖ్య ఒక్కసారిగా 17కు పెరగ్గా, 2024-25 నాటికి అత్యధికంగా 19 మరణాలు నమోదయ్యాయి. ఇందులో జనరల్ కేటగిరీకి చెందిన విద్యార్థులు 23 మంది (43.4%), ఓబీసీలు 12 మంది, ఎస్సీలు 10 మంది, ఎస్టీలు ఏడుగురు, ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ఉన్నారు.
ఒత్తిడి, గ్రేడింగ్ విధానమే కారణం..?
ఐఐటీ విద్యార్థుల్లో పెరుగుతున్న ఈ ఆత్మహత్యల ధోరణిపై విద్యావేత్తలు, ప్రొఫెసర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మితిమీరిన విద్యా ఒత్తిడి, రిలేటివ్ గ్రేడింగ్ విధానం, సామాజికంగా ఒంటరితనం, అధ్యాపకులతో తగినంత అనుసంధానం లేకపోవడం, ఉద్యోగాల గురించి ఆందోళనలే విద్యార్థులను ఈ తీవ్ర నిర్ణయాల వైపు నెడుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం దేశంలోని 23 ఐఐటీ క్యాంపస్‌లలో కలిపి 108 మంది సైకలాజికల్ కౌన్సిలర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, సమస్య వచ్చాక పరిష్కరించే కౌన్సెలింగ్ విధానాల కంటే.. విద్యార్థుల మానసిక క్షేమానికి పెద్దపీట వేసే నివారణోపాయాలను క్యాంపస్ జీవితంలో భాగం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

