కలం, నల్లగొండ బ్యూరో: దక్షిణ భారతదేశంలోనే రెండో అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా పేరుగాంచిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (YTPS)లో సంక్షోభం నెలకొన్నది. ఓవైపు టెక్నికల్ సమస్యలు, మరోవైపు బొగ్గు కొరతతో విద్యుత్ ఉత్పత్తి ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్‌లో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో నాలుగు యూనిట్ల ఉండగా, ఇప్పటికే రెండు యూనిట్లు బంద్ అయ్యాయి.
కొంతకాలం కింద టెక్నికల్ లోపంతో యూనిట్-4లో ఉత్పత్తి నిలిచిపోగా, తాజాగా యూనిట్-3 కూడా మూతపడింది. దీంతో మొత్తంగా 1,600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ప్రస్తుతం యూనిట్ 1, 2 నడుస్తుండగా.. కేవలం నాలుగు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే అవి కూడా మూతపడే అవకాశం ఉన్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.
నాణ్యత లేని బొగ్గు సరఫరా..
సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (CEA) నిబంధనల ప్రకారం ప్రతి థర్మల్ ప్లాంట్‌లో కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ వైటీపీఎస్‌లో ప్రస్తుతం 4 రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. సింగరేణి సహా ఒడిశాలోని నైని గని నుంచి సరఫరా జరుగుతున్నప్పటికీ, అది ఏమూలకూ సరిపోవడం లేదు. రానున్న రోజుల్లో పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్లాంట్‌ను పూర్తిగా మూసివేయక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సింగరేణి సంస్థ నుంచి జెన్కోకు దీర్ఘకాలిక లింకేజీ కింద 28.87 మిలియన్ టన్నుల బొగ్గు కేటాయించగా, వైటీపీఎస్‌కు 14 మిలియన్ టన్నుల జీ-9 గ్రేడ్ (ఉత్తమ నాణ్యత) బొగ్గును సరఫరా చేయాల్సి ఉంది.
అయితే సీఈఏ నిబంధనల ప్రకారం ప్లాంట్‌కు 15.75 మిలియన్ టన్నుల జీ-9 బొగ్గు అవసరం కాగా, సింగరేణి మాత్రం నాణ్యత లేని జీ-13 గ్రేడ్ బొగ్గును పంపుతోందని జెన్కో వర్గాలు అంటున్నాయి. నాణ్యత 40 శాతానికే పరిమితం కావడం వల్ల ప్లాంట్‌కు కావాల్సిన బొగ్గు పరిమాణం ఏకంగా 21.45 మిలియన్ టన్నులకు పెరిగింది. సరఫరాలోనూ సింగరేణి 2025-26 ఆర్థిక సంవత్సరంలో 76 శాతం బొగ్గును మాత్రమే ఇచ్చిందని అధికారులు చెబుతున్నారు.
బొగ్గు సరఫరాకు ఎంసీఎల్ మెలిక..
సింగరేణి నుంచి నాణ్యమైన బొగ్గు అందకపోవడంతో జెన్కో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్ (ఎంసీఎల్) నుంచి 5 మిలియన్ టన్నుల బొగ్గును అందించాలని కోరుతూ గత నెలలో లేఖ రాసింది. అయితే నిర్ణీత ధరకు బొగ్గు ఇవ్వలేమని, పెంచిన ధరలకు లేదా ఈ-వేలంలో పాల్గొని కొనుగోలు చేయాలని ఎంసీఎల్ షరతు విధించింది. సీఈఏ అనుమతి లభిస్తేనే శాశ్వత ప్రాతిపదికన సరఫరా చేస్తామని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
వైటీపీఎస్‌లో తలెత్తిన సంక్షోభంపై జెన్కో సీఎండీ హరీశ్ స్పందించారు. దక్షిణ డిస్కమ్ సీఎండీ జితేశ్ పాటిల్‌తో వీర్లపాలెంలోని ప్లాంట్‌ను సందర్శించారు. బొగ్గు నిల్వలు, ఉత్పత్తి సామర్థ్యం, ఆగిపోయిన యూనిట్లలో సాంకేతిక సమస్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బొగ్గు కొరతను అధిగమించేందుకు, బంద్ అయిన యూనిట్లలో తిరిగి ఉత్పత్తిని ప్రారంభించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

