కలం, వనపర్తి: జూరాల ఆయకట్టు రైతులు అధైర్యపడొద్దని, ఒక్క ఎకరం పంట కూడా ఎండిపోకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) తెలిపారు. ప్రస్తుత పంటలకు సాగునీరు అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. తెలంగాణలోని జూరాల, భీమా, నెట్టెంపాడు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకాల పరిధిలోని పంటలను కాపాడేందుకు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున 15 రోజుల పాటు కృష్ణా జలాలను నియంత్రితంగా విడుదల చేయాలని రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు లేఖ రాసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ నాలుగు పథకాల కింద సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు కృష్ణా జలాలపై ఆధారపడి ఉందని తెలిపారు. సాగునీటి విడుదలపై కర్ణాటక సీఎంతో చర్చించేందుకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు తూడి మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బృందం హైదరాబాద్ నుంచి మంగళవారం సాయంత్రం కర్ణాటకకు బయలుదేరనున్నట్లు తెలిపారు.
సమావేశం అనంతరం రైతులకు శుభవార్త అందుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. “రైతులు అధైర్యపడొద్దు. పంటలు చేతికొచ్చే వరకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సాగునీటిని సమకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. జూరాల ఆయకట్టు కింద ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడటమే లక్ష్యం” అని మేఘారెడ్డి పేర్కొన్నారు.

