కలం, ఖమ్మం బ్యూరో : వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో 24 గంటల పాటు మద్యం విక్రయాలను పూర్తిగా నిషేధిస్తూ మంగళవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ (CP Sunil Dutt) ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆంక్షలు సెప్టెంబర్ 23 (బుధవారం) ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమై, సెప్టెంబర్ 24 ఉదయం 6 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించారు. ఈ నిర్ణీత సమయంలో కమిషనరేట్ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు, బార్లు రెస్టారెంట్లు, క్లబ్బులు, నక్షత్ర హోటళ్లు, మద్యం విక్రయించే లేదా సరఫరా చేసే అన్ని రకాల సంస్థలు తప్పనిసరిగా మూసివేసి ఉండాలని సీపీ ఆదేశించారు.
భక్తులు ఎంతో పవిత్రంగా జరుపుకునే గణేష్ నిమజ్జనం వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూసేందుకు, శాంతిభద్రతల పరిరక్షణ కోసం తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 20 ప్రకారం ఈ ‘డ్రై డే’ నిబంధనలను అమలు చేస్తున్నట్లు సీపీ (CP Sunil Dutt) స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘించి ఎవరైనా రహస్యంగా మద్యం అమ్మకాలు జరిపినా, హోటళ్లు లేదా క్లబ్బులలో వినియోగదారులకు మద్యం సరఫరా చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రశాంత వాతావరణంలో, ఆధ్యాత్మిక ఉత్సాహంతో వేడుకలు పూర్తి కావడానికి పోలీసు యంత్రాంగం నిరంతర పర్యవేక్షణలో ఉంటుందని చెబుతూ, ప్రజలు, నిమజ్జన ఊరేగింపు నిర్వాహకులు పోలీసు శాఖకు పూర్తి స్థాయిలో సహకరించాలని సీపీ సునీల్ దత్ కోరారు.

