కలం, వెబ్ డెస్క్: ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన (Rains Alert) చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి.. ఏపీ వైపు దూసుకొస్తుంది. ప్రస్తుతం విశాఖపట్నానికి 320 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం తెల్లవారుజామున విశాఖ–గోపాల్‌పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
మరీ ముఖ్యంగా కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారుతుందని, మత్స్యకారులు ఎట్టిపరిస్థితుల్లో వేటకు వెళ్లొద్దని అధికారులు పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూంను సంప్రదించాలని విపత్తు నిర్వహణల శాఖ పేర్కొంది.
పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
వాయుగుండం ప్రభావం కారణంగా విశాఖపట్నంలో వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. బుధవారం రోజు కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడబోతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అనకాపల్లి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వచ్చే నాలుగైదు రోజుల పాటు వర్షాలు పడుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

