కలం, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని బండ్లగూడ ఆర్టీవో (Bandlaguda RTO)లో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా, మంగళవారం సైతం అధికారుల తనిఖీలు కొనసాగాయి. ఈ సందర్భంగా పలువురు ఉద్యోగుల సెల్‌ఫోన్లలో అనుమానాస్పద యూపీఐ లావాదేవీలను అధికారులు గుర్తించారు. అలాగే ఆఫీస్‌లో గుర్తు తెలియని, అనధికార వ్యక్తులు, ఏజెంట్లు దరఖాస్తులతో సంచరిస్తున్నట్లు గుర్తించారు.
కొంతమంది అధికారులు, సిబ్బంది దరఖాస్తులపై ప్రత్యేక గుర్తులు, పేర్లు నమోదు చేసి ఏజెంట్ల ద్వారా వాటిని వేగంగా ప్రాసెస్ చేసే విధానాన్ని అనుసరిస్తున్నట్లు ఏసీబీ గుర్తించింది. ఆఫీస్‌లో ఉన్న ఏజెంట్ల వద్ద రూ.24,760 నగదు స్వాధీనం చేసుకుంది. సాయికుమార్, సాయికాంత్ డెస్క్‌లకు సంబంధించిన 33 ట్రాన్స్‌పోర్ట్ దరఖాస్తులు కనిపించలేదని గుర్తించారు. కొందరు ఉద్యోగులు ఏళ్ల తరబడి ఇదే ఆఫీస్‌లో పని చేస్తున్నట్లు కూడా తనిఖీల్లో బయటపడింది. ముఖ్యంగా ఎంఏ లతీఫ్ అనే వ్యక్తి సుమారు 20 ఏళ్లుగా ఇక్కడే పని చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీంతో కార్యాలయంలో అక్రమాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

