ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో నిలిచిపోయిన ప్రతిష్టాత్మక నంది ఫిల్మ్, టీవీ , నాటక అవార్డుల ప్రదానోత్సవానికి (Nandi Awards ) కూటమి ప్రభుత్వం మళ్లీ శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు నంది అవార్డుల నిర్వహణకు కూటమి ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ పురస్కారాల పునరుద్ధరణపై కీలక ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో కళాకారులకు తగిన గుర్తింపునిచ్చేలా ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా నంది అవార్డుల ప్రక్రియ వేగవంతం చేసేందుకు సెప్టెంబర్‌ నాటికి ప్రత్యేక అవార్డుల ఎంపిక కమిటీని ఏర్పాటు చేసి, అక్టోబర్‌లో అధికారిక ప్రకటన వెలువరించనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. 2012 నుంచి 2016 వరకు గతంలో ప్రకటించి, సాంకేతిక ఇతర ఇతర కారణాల వల్ల ప్రదానం చేయకుండా నిలిచిపోయిన నంది అవార్డులను ప్రభుత్వం త్వరలోనే విజేతలకు అందజేస్తుందని చెప్పారు. ఇక 2017 నుంచి 2024 వరకు బకాయి ఉన్న సంవత్సరాలకు సంబంధించి ఏటా 4 ఏళ్ల చొప్పున విభజించి అవార్డులను ప్రధానం చేయనున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు 2025 సంవత్సరానికి సంబంధించిన నంది ఫిల్మ్, టీవీ అవార్డులను కూడా యథావిధిగా అందిస్తామని మంత్రి వివరించారు.

ఈ మొత్తం అవార్డుల ప్రధానోత్సవ ప్రక్రియను డిసెంబర్ 2026 నాటికి పూర్తి చేయాలని స్పష్టమైన లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇక నంది ఫిల్మ్ అవార్డులు, నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవ వేడుకలను అమరావతి లేదంటే విజయవాడలో నిర్వహించనున్నట్లు తెలిపారు. బుల్లితెర కళాకారులను గౌరవించే నంది టీవీ అవార్డుల వేడుకను ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతిలో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>