కలం, యాదగిరిగుట్ట: దేవుడి సన్నిధిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళ ప్రాణాలు తీసింది అతివేగం. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి దివ్యక్షేత్రం (Yadadri Temple) కొండపైన మంగళవారం ఒక ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. దేవుడి సన్నిధిలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్న ఒక నిరుపేద మహిళ, అతివేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు గత కొన్ని సంవత్సరాలుగా యాదాద్రి కొండపైనే ఉంటూ, యాచక వృత్తి ద్వారా జీవనం సాగిస్తుంది.
భక్తుల రద్దీని కూడా లెక్కచేయకుండా డ్రైవర్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. పుణ్యక్షేత్రంపై వాహనాలు ఇంత వేగంగా వెళ్లడం వల్ల నిత్యం ప్రమాదాలు జరిగే ముప్పు ఉందని భక్తులు, స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

