రైతుల పోరాటం.. పట్టు వీడని సర్కార్!

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: చేతికొచ్చిన పంటలను ఎండిపోకుండా దక్కించుకునేందుకు రైతులు పోరాటం చేస్తుండగా, తాగునీటి అవసరాల కోసం నీటిని వదిలేది లేదంటూ ప్రభుత్వం ఆరాట పడుతూ పట్టుదలకు పోవడంతో జూరాల ప్రాజెక్ట్ (Jurala Project) వద్ద హై టెన్షన్ నెలకొంది. సాగునీటి విడుదలకు రైతులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు చేపట్టిన ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో యుద్ధ వాతావరణం తలపించింది. జూరాల ఆయకట్టు కింద పంటలు ఎండుతుండ టంతో తక్షణమే నీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులు తాగునీటి సాకుతో నిలిపివేశారని ఆరోపిస్తున్నారు. కొద్ది రోజుల కింద ఆగ్రహించిన రైతులు స్వయంగా ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసుకోవడం కలకలం రేపింది. అనంతరం రైతులు, పార్టీల నేతలు ప్రాజెక్టును ముట్టడించకుండా పోలీసులు భారీగా మోహరించారు. ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ తరహా ఆంక్షలు విధించారు. ఎవరూ డ్యామ్ పైకి వెళ్లకుండా ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ అధికారులు ఎడమ కాల్వకు గేట్లను మూసివేయడాన్నికూడా రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఎవరి వాదన వారిదే..

ఇది రాజకీయ పార్టీల పొలిటికల్ మైలేజీ కోసమేనని కొందరు రైతులను రెచ్చగొట్టి ధర్నాలు, రాస్తారోకోలకు ఉసిగొలుపుతున్నారని అంటున్నారు. ఇది కేవలం రాజకీయ మైలేజ్ కాదని, రైతుల జీవన్మరణ సమస్య అని బీఆర్ఎస్ వాదిస్తోంది. ప్రాజెక్టు (Jurala Project)లో నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రస్తుతం 5.1 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని, ఎల్ నినోతో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ప్రతిపక్షాలు కరువు పరిస్థితులను రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నాయని అధికార పక్షం విమర్శిస్తోంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రైతులు నీరు విడుదల చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెబుతున్నారు.

రాజకీయ ఆధిపత్య పోరుగా సమస్య

జూరాల ప్రాజెక్టు వద్ద నీటి విడుదల అంశం రైతుల సమస్యగానే కాకుండా, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. రైతులకు సాగునీరు ఇవ్వకపోవడం ప్రభుత్వ వైఫల్యమని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. జూరాలలో 9 టీఎంసీల నీరు ఉందని, అందులో తాగునీటికి 2 టీఎంసీలు మాత్రమే సరిపోతాయని, మిగిలిన నీటిని రైతులకు ఇవ్వవచ్చని మాజీ మంత్రి కేటీఆర్, నిరంజన్ రెడ్డి వంటి నేతలు వాదిస్తున్నారు.

ప్రభుత్వం మాత్రం ముందు తాగునీరు ఆ తర్వాతే సాగునీరు అనే విధానాన్ని తెరపైకి తెచ్చింది. ప్రతిపక్షాలు కావాలనే రైతులను రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తున్నాయని మంత్రులు ఆరోపిస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.65 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 5.1 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీటిని ఇప్పుడు సాగుకు వాడేస్తే, వేసవిలో తీవ్రమైన తాగునీటి కష్టాలు వస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, గత ప్రభుత్వం ప్రాజెక్టులను పట్టించుకోలేదనేది అధికార పక్షం విమర్శిస్తోంది. మొత్తం మీద ఇది పాక్షికంగా రాజకీయ మైలేజీ కోసమే అని చెప్పక తప్పని పరిస్థితులు ఉన్నాయి.

కర్నాటక వదిలితేనే పంటలు దక్కేచాన్స్

ఎల్ నినో తో వర్షాభావ పరిస్థితులు ఉండడంతో అన్నదాతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రాజెక్టుల కింద పంటల్ని సాగుచేసిన రైతులకు సరిపడా నీరు అందక చేతికొచ్చిన పంటలను కాపాడుకునే మార్గం లేక రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకాలు చేయాల్సిన పరిస్థితులు దాపురించాయి. జూరాల ప్రాజెక్టుపై భాగంలో కర్ణాటక ప్రభుత్వం నిర్మించిన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ లో నుంచి నీటిని జూరాలకు విడుదల చేస్తేనే మన పంటలు కాపాడుకునే పరిస్థితులు ఉన్నాయి.

జూరాల కుడి, ఎడమ కాల్వల కింద అమరచింత, ఆత్మకూరు పెబ్బేరు, మదనాపురం, ధరూరు, గద్వాల, ఇటిక్యాల తదితర మండలాల్లోని దాదాపు లక్షకుపైగా ఎకరాల్లో వేసిన పంటలకు దయతలిచి కర్ణాటక ప్రభుత్వం నీటిని వదిలితే మేలు జరుగుతుంది. జూరాల ఎత్తిపోతల ప్రాజెక్టు కింద సుమారు 7.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. పంటలను కాపాడుకోవడానికి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అందుకే కర్ణాటక ప్రభుత్వం కరుణిస్తేనే కాపాడుకునే చాన్స్ ఉండగా.. ఆ దిశగా ప్రభుత్వం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది.

జూరాల ప్రాజెక్ట్ పరిస్థితి ఇలా..

జూరాలలో ప్రస్తుతం 8.110 టీఎంసీల నీరు ఉంది. అందులోంచి ప్రస్తుతం 5.13 టీఎంసీలు నీటిని మాత్రమే వాడుకునేందుకు అవకాశం ఉంది. ఇందులో దాదాపు 3.50 టీఎంసీ లు తాగునీటి అవసరాల కోసం మాత్రమే కేటాయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో సాగునీటి కోసం జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని వదిలే ప్రసక్తే లేదని అధికారులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>