కలం, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణ , ఎలక్ట్రానిక్స్ రంగాలను ప్రోత్సహించే లక్ష్యంతో సవరించిన నూతన వస్తు సేవల పన్ను రేట్లు (New GST Rates) నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. జీఎస్టీ మండలి నిర్ణయించిన సిఫార్సుల మేరకు పలు నిత్యావసర ఉత్పత్తులు, సాంకేతిక పరికరాలు, గ్రీన్ టెక్నాలజీ ఉత్పత్తులపై పన్ను శ్లాబులను గణనీయంగా తగ్గించారు.
ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఇంధన నిల్వ రంగానికి ఊరటనిస్తూ, ఎలక్ట్రిక్ అక్యుమ్యులేటర్ల పై విధించే జీఎస్టీని గతంలో ఉన్న 28 శాతం నుండి 18 శాతానికి తగ్గించారు. బ్యాటరీ బ్యాకప్‌లు, ఇన్వర్టర్లు, ఇంధన నిల్వ వ్యవస్థల్లో విస్తృతంగా ఉపయోగించే ఈ పరికరాలపై పన్ను తగ్గడం వల్ల డిజిటల్ పరికరాలు, అలాగే చిన్న తరహా పవర్ బ్యాకప్ సిస్టమ్‌ల ధరలు తగ్గి వినియోగదారులకు లబ్ధి చేకూరనుంది.
అలాగే పర్యావరణ పరిరక్షణ, సేంద్రీయ వ్యర్థాల నిర్వహణను వేగవంతం చేసేందుకు గానూ కంపోస్టింగ్ మేషిన్లపై విధించే పన్నును 12 శాతం నుండి 5 శాతానికి తగ్గించారు. ఈ నిర్ణయం వల్ల రీసైక్లింగ్ ప్రాసెస్ తక్కువ ఖర్చుతో అందుబాటులోకి రానుంది. అపార్ట్మెంట్లు, స్థానిక సంస్థలు , వ్యాపార సముదాయాలు వ్యర్థాల నిర్వహణ పరికరాలను సులభంగా కొనుగోలు చేయడానికి ఇది దోహదపడుతుంది.

