కలం, మహబూబ్ నగర్ బ్యూరో: జూరాల ఆయకట్టు కింద పంటలకు సాగు నీళ్లు విడుదల చేయాలని కోరుతుంటే బీఆర్ఎస్ నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తారా.. అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) ప్రశ్నించారు. శ్రీశైలం నుంచి 660 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పానికి నీళ్లు తీసుకెళ్లామని చంద్రబాబు చెబుతుంటే.. పక్కనే ఉన్న పాలమూరుకు మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని విమర్శించారు. కృష్ణా జలాలను పోతిరెడ్డిపాడు, వెలిగొండ, మాల్యాల, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాల ద్వారా 100 టీఎంసీలకు పైగా ఆంధ్రప్రదేశ్‌కు వదిలిపెట్టి తెలంగాణ రైతుల గొంతు కోశారని మండిపడ్డారు. జూరాల ప్రాజెక్టును పోలీసులు పూర్తిగా దిగ్బంధించి, భారీగా పోలీసు బలగాలను మోహరించారన్నారు.
రైతుల కోసం అలా చేయలేరా..?
రైతులు నీళ్లు అడుగుతుంటే వారి చేతులకు సంకెళ్లు వేస్తారా? అంటూ ప్రభుత్వ తీరును శ్రీనివాస్ గౌడ్ ఎండగట్టారు. ప్రస్తుతం జూరాలలో 8.8 టీఎంసీల నీళ్లు ఉన్నాయని.. తాగునీటికి 2 టీఎంసీలు కేటాయించినా మిగతా నీళ్లతో లక్ష ఎకరాలు కాపాడొచ్చని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆల్మట్టిలో 123 టీఎంసీలు, నారాయణ్‌పూర్‌లో 32 టీఎంసీల నీటి నిల్వ ఉందని.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కాబట్టి, సొంత జిల్లా రైతుల కోసం కనీసం 5 టీఎంసీల నీటిని తీసుకురాలేరా? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. కృష్ణాలో నీటి ప్రవాహాలు ఉన్న సమయంలో నీటిని లిఫ్ట్ చేయకుండా భీమాలో మూడు పంపులు ఉంటే ఒక్క పంపు, నెట్టెంపాడులో ఒక్క పంపునే నడిపి ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వహించారనీ శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.

