కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితుడికి ఐదేండ్ల కారాగార శిక్ష పడింది. ఈ మేరకు సత్తుపల్లి (Sathupalli) అదనపు సెషన్స్ జడ్జి ఎం. శ్రీనివాస్ సోమవారం తీర్పు వెలువరించారు. ఈ మేరకు ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయం కేసు వివరాలను వెల్లడించింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎర్రుపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన పెండ్లి తిరుపతిరావు (51)పై 2021లో హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయస్థానం, నిందితుడిపై నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేసింది.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి. డేనియల్ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన ఎస్ఐ టి. ఉదయ్ కిరణ్, బ్రీఫింగ్ అధికారి ఎస్ఐ ఎం. రమేష్ కుమార్లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు. నేరస్తులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సీపీ పేర్కొన్నారు.
హత్యాయత్నం కేసులో ఎర్రుపాలెం నిందితుడికి ఐదేండ్లు జైలు

