కలం, మహబూబ్ నగర్ బ్యూరో: గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి (SP Janaki) తెలిపారు. పోలీసు అధికారులతో కలిసి మహబూబ్నగర్ పట్టణంలో నిమజ్జనం జరిగే ప్రధాన రూట్లు, ముఖ్యమైన కూడళ్లు, సున్నితమైన ప్రాంతాలు, నిమజ్జన పాయింట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పన్నపల్లి ఈకో పార్క్, పంచవటి స్కూల్ పక్కన, చిన్నదర్పల్లి సమీపంలో ఏర్పాటు చేసిన కృత్రిమ బేబీ పాండ్స్ ప్రాంతాలను పరిశీలించారు.
హైదరాబాద్, భూత్పూర్, రాయచూర్, కోయిలకొండ, చించోలి తదితర ప్రాంతాల నుంచి మహబూబ్నగర్ పట్టణంలోకి వచ్చే భారీ వాహనాలు బైపాస్ రోడ్డునే వినియోగించుకోవాలని ఎస్పీ డి.జానకి తెలిపారు. సోమవారం సాయంత్రం నుంచి 25 వ తేదీ ఉదయం 6 గంటల వరకు పట్టణంలోని క్లాక్ టవర్ కూడలికి అన్ని రకాల వాహనాల రాకపోకలకు అనుమతి ఉండదన్నారు.
డీజే వినియోగించవద్దు..
డీజే వినియోగానికి అనుమతి లేదని ఎస్పీ డి.జానకి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేయవద్దన్నారు. గణేష్ ఉత్సవాలు, శోభాయాత్ర, నిమజ్జనం, ట్రాఫిక్ మళ్లింపులు, పోలీస్ బందోబస్తు తదితర అంశాలకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే అసత్య, నిర్ధారణ కాని వార్తలు, వదంతులు, పాత వీడియోలను షేర్ చేయొద్దన్నారు. అనుమానాస్పద సమాచారం లేదా వదంతులు వ్యాప్తి చెందుతున్నట్లు గమనించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ క్షేత్రస్థాయి పరిశీలనలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ రెడ్డి, మహిళా పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణయ్య పాల్గొన్నారు.

