800 మంది పోలీసులతో భద్రత: ఎస్పీ డాక్టర్ వినీత్

కలం, నారాయణపేట: నారాయణపేట జిల్లాలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని భద్రతా చర్యలు చేపట్టిందని ఎస్పీ డాక్టర్ వినీత్ (SP Vineeth) తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సుమారు 800 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. డీజేలకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ముందు జాగ్రత్తగా జిల్లా వ్యాప్తంగా 125 మంది డీజే నిర్వాహకులు, 25 మంది రౌడీషీటర్లు, 77 మంది కమ్యూనల్ షీటర్లు బైండోవర్ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,728 గణేష్ విగ్రహాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి జియో ట్యాగింగ్ చేశామన్నారు.

అనుచిత పోస్టులు పెడితే..

సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ డాక్టర్ వినీత్ హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ సంయమనం పాటిస్తూ పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు. నారాయణపేట, ఉట్కూర్, మక్తల్, కోస్గి పట్టణాల్లో ఇతర శాఖల సమన్వయంతో ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శోభాయాత్ర జరిగే మార్గాలు, నిమజ్జన ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

డ్రోన్ కెమెరాలు, వీడియో గ్రఫీ ద్వారా శోభాయాత్రను రికార్డు చేస్తూ నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తామని ఎస్పీ వినీత్ చెప్పారు. జిల్లా కేంద్రంలో గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం, తాఖీ బాబా దర్గా ఉర్సు కార్యక్రమాలు ఒకే సమయంలో జరుగుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. అదనపు ఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ మహేష్, లింగయ్య, సీఐ శివ శంకర్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>