‘ఆసియా గేమ్స్‌లో అవినీతే’.. సుచికా సంచలన ఆరోపణలు

కలం, స్పోర్ట్స్ : ఆసియన్ గేమ్స్‌ ఎంఎంఏ సెమీఫైనల్‌లో వివాదాస్పద నిర్ణయంపై భారత ఫైటర్ సుచికా తరియాల్ (Suchika Tariyal) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ.. ఈ వ్యవహారంలో అవినీతి కనిపించిందని సంచలన వ్యాఖ్యలు చేసింది. ట్రెడిషనల్ 60 కేజీల విభాగం సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టూన్‌తో సుచికా తలపడింది. పోరులో తానే ఆధిపత్యం చూపించానని సుచికా భావించింది. అయితే జడ్జీల నిర్ణయం మాత్రం సింగపూర్ ఫైటర్‌కు అనుకూలంగా వచ్చింది.

దీంతో సుచికా (Suchika Tariyal) ఆ నిర్ణయాన్ని అంగీకరించలేదు. వెంటనే ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. అక్కడ ముగ్గురు జడ్జీలు మ్యాచ్‌ను మరోసారి పరిశీలించారు. మళ్లీ స్కోరింగ్ చేసిన తర్వాత కూడా విజేతను తేల్చలేకపోయారు. దీంతో మ్యాచ్ డ్రాగా ప్రకటించారు. అయితే డ్రా తర్వాత మరో నిబంధన తెరపైకి వచ్చింది. ఆసియా మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం డ్రా అయితే తక్కువ బరువు ఉన్న ఫైటర్‌ను విజేతగా ప్రకటిస్తారు.

సింగపూర్ ఫైటర్ కంటే సుచికా 700 గ్రాములు ఎక్కువ బరువుతో ఉంది. దీంతో బరువు నిబంధన ఆధారంగా సింగపూర్ ఫైటర్‌ను విజేతగా ప్రకటించారు. సుచికా ఫైనల్ అవకాశాన్ని కోల్పోయింది. ఈ నిర్ణయంపై సుచికా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తాను రెండు రౌండ్లలోనూ బాగా పోరాడానని తెలిపింది. చివరి నిమిషంలో కూడా తానే స్కోర్ చేస్తుండగా ప్రత్యర్థి తన నుంచి దూరంగా కదులుతూ కనిపించిందని చెప్పింది.

అయినా నిర్ణయం తనకు వ్యతిరేకంగా వచ్చిందని సుచికా పేర్కొంది. ఈ నిర్ణయాన్ని తాను అంగీకరించలేదని, తనకు పతకం ఎంతో ముఖ్యమని చెప్పింది. అంతేకాదు.. సింగపూర్‌కు చెందిన ఫెడరేషన్ కావడంతోనే ఆ దేశ ఫైటర్‌కు అనుకూలంగా నిర్ణయం వచ్చిందని సుచికా ఆరోపించింది. ఫైటర్ గురించి కాకుండా తమ దేశం గురించే ఆలోచించారని పేర్కొంది. ఇలాంటి అవినీతి ప్రతిచోటా ఉందని, ఇక్కడ కూడా తాను చూశానని వ్యాఖ్యానించింది.

సుచికా కోచ్ నిఖిల్ కుందర్ కూడా ఆర్బిట్రేషన్‌పై వివరించాడు. తమకు సుచికానే విజేతగా నిలిచిందన్న నమ్మకం ఉందని చెప్పాడు. అయితే ముగ్గురు జడ్జీలు మళ్లీ స్కోర్ చేసిన తర్వాత మ్యాచ్ డ్రాగా మారిందని తెలిపాడు. డ్రా తర్వాత సింగపూర్‌కు మరోసారి ఆర్బిట్రేషన్‌కు వెళ్లే అవకాశం ఉందని కుందర్ వివరించాడు. లేదంటే బరువు నిబంధనను ఎంచుకోవచ్చని చెప్పాడు. సింగపూర్ రెండో మార్గాన్ని ఎంచుకుందని తెలిపాడు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>