కొత్తపల్లి ఊర చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌పై క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు

కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 17వ డివిజన్ కొత్తపల్లి ఊర చెరువు (Kothapalli Lake) ఎఫ్.టి.ఎల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టి, చెరువును కాపాడాలని కోరుతూ సోమవారం కొత్తపల్లి మాజీ పట్టణ అధ్యక్షులు కెంచ శేఖర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన కలెక్టర్.. తక్షణమే జాయింట్ సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాల‌ను ప‌రిశీలిస్తే.. కొత్తపల్లి ఊర చెరువు సుమారు 876 ఎకరాలకు సాగునీరు అందిస్తుండగా, కొత్తపల్లి ప్రాంత ప్రజలకు ప్రధాన తాగునీటి వనరుగా ఉంది. మత్స్యకారులకు చేపల పెంపకానికి, రజకులకు బట్టలు ఉతకడానికి ఇదోక ఏకైక నీటి ఆధారం. ఈ చెరువు నిండినప్పుడు కొత్తపల్లితో పాటు రేకుర్తి, కొత్తయాస్వాడ, జ్యోతినగర్, వావిలాలపల్లి వరకు భూగర్భ జలాలు పెరిగి ఆయా ప్రాంతాల ప్రజల నీటి అవసరాలు తీరుతున్నాయి.

సర్వే నెం. 686, 687లలో రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా నాలా కన్వర్షన్ చేయించి, అక్రమంగా మట్టి నింపుతూ చెరువు నీటి సామర్థ్యాన్ని తగ్గిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జయ గార్డెన్ వెనుక ఉన్న ప్రధాన మురికి కాలువను ధ్వంసం చేసి మట్టితో పూడ్చివేయడం వల్ల 17వ డివిజన్‌లోని మురుగునీరు ఒకచోట నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. ఎఫ్.టి.ఎల్ పరిధిలోని సర్వే నెంబర్లలో ఎలాంటి మోకా ఎంక్వైరీ చేయకుండా, రిజిస్ట్రేషన్లు జరగకుండా చూడాలని కోరారు. మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు ఇంతకు ముందు పలుమార్లు విజ్ఞప్తి చేసినా చర్యలు శూన్యమని ఆరోపించారు.

కలెక్టర్ స్పందించి వెంటనే జాయింట్ సర్వే కోసం కరీంనగర్ ఆర్డీవో, కొత్తపల్లి ఎంఆర్ఓ, నీటిపారుదల శాఖ అధికారులు మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ వెంచర్లు, నాలా కన్వర్షన్లు చేపట్టిన రియల్ ఎస్టేట్ వ్యాపారులపై తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కొత్తపల్లి జోన్ అధ్యక్షులు ముత్తునూరి హరీష్, దుబ్బసి సునీల్, వేముల శివ, మహేశని హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>