కలం, భైంసా: భైంసా మండలం పెండ్పెల్లి (Pendpalli) గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ సోమవారం ప్రారంభించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. రూ.30 లక్షలతో నిర్మించిన పాఠశాల ప్రహరీ గోడ, రూ.20 లక్షలతో నిర్మించిన మహిళా సమైక్య భవనం, రూ.57 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్లు, రూ.14 లక్షలతో నిర్మించిన డ్రైనేజీ, రూ.7 లక్షలతో చేపట్టిన అమ్మ ఆదర్శ పాఠశాల పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రూ.కోటి నిధులతో నిర్మించిన బీటీ రోడ్డు పనులను కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు. మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్‌రావు పటేల్, మాజీ ఎంపీపీ రజాక్, భైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు, దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

