​బీజేపీది చౌకబారు ధర్నా డ్రామా: కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కలం, కరీంనగర్: ​గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై ప్రభుత్వం మొదటి నుంచి పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తుంటే బీజేపీ (BJP) నాయకులు నీటి విడుదలపై ధర్నాల పేరుతో నాటకాలాడుతున్నారని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (Komatireddy Narender Reddy) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరీంనగర్ సమీపంలోని చింతకుంట కెనాల్ వద్ద జరుగుతున్న గణేష్ నిమజ్జన ఏర్పాట్లను సోమ‌వారం ఆయన స్థానిక నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ తీరుపై ఆయన ఘాటుగా స్పందించారు. ​రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు గత వారం రోజులుగా నిమజ్జన ఏర్పాట్లు, కెనాల్‌కు నీటి విడుదలపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ, పరిపరిస్థితులను మానిటరింగ్ చేస్తున్నారని తెలిపారు. నిన్నటి నుంచే అధికారులు నిమజ్జన ప్రాంతంలో మిషనరీని రంగంలోకి దించి కెనాల్‌లో పూడిక (సిల్ట్) తీయించడం, డస్ట్ పోయించడం వంటి పనులను ముమ్మరంగా చేపట్టారన్నారు.

​ఉదయం 11 గంటలకు కెనాల్‌కు నీరు విడుదలవుతుందనే పక్కా సమాచారం తెలుసుకొని, బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే 10:30 గంటలకే ధర్నా పేరుతో హడావుడి చేశారని విమర్శించారు. ధర్నా చేసిన ఐదు నిమిషాలకే తమ పోరాటం వల్లే ప్రభుత్వం నీటి విడుదలకు నిర్ణయం తీసుకుందని బీజేపీ నాయకులు తప్పుడు ప్రకటనలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది వారి రాజకీయ డ్రామాలకు పరాకాష్ట అని, ఇలాంటి చౌకబారు ట్రిక్స్ ప్రజల ముందు ఇకపై చెల్లవని స్పష్టం చేశారు. ​కరీంనగర్ అభివృద్ధి విషయంలో గానీ, అన్ని వర్గాల పండుగల నిర్వహణలో గానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నరేందర్ రెడ్డి తెలిపారు. భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అందరి మనోభావాలను గౌరవిస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. బీజేపీ ఆడుతున్న రాజకీయ నాటకాలను ఇకపై కొన‌సాగ‌వ‌ని ఆయన హెచ్చరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>