కలం, నల్లగొండ: విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని కేవలం ఉద్యోగాలు, కోడింగ్‌లకే పరిమితం చేయకుండా, సమాజంలోని నిజ జీవిత సమస్యల పరిష్కారానికి, సమ్మిళిత సమాజ నిర్మాణానికి వినియోగించాలని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం (MGU) వైస్ ఛాన్సలర్ ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ (Khaja Altaf Hussain) పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయ ఎంసీఏ విభాగం ఆధ్వర్యంలో నూతనంగా చేరిన విద్యార్థుల కోసం నిర్వహించిన ‘ఇండక్షన్ కార్యక్రమానికి’ ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వీసీ అల్తాఫ్ హుస్సేన్ (Khaja Altaf Hussain) మాట్లాడుతూ.. కంప్యూటర్ విద్య అనేది కేవలం ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఉపాధి నైపుణ్యాలకే పరిమితం కాకూడదని, సామాన్య ప్రజలకు సేవలు అందించే స్థాయికి విస్తరించాలని ఆకాంక్షించారు. సంక్షేమం, పాలన, ప్రజా సేవల పంపిణీ, అణగారిన వర్గాల అవసరాలను తీర్చేలా విద్యార్థులు డిజిటల్ పరిష్కారాలను అన్వేషించాలని సూచించారు.
స్పష్టమైన లక్ష్యంతో నిరంతర అభ్యాసం, క్రమశిక్షణ, సృజనాత్మక ఆలోచనలతో నూతన ప్రయోగాలు చేయాలని విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. గ్రామీణ, మధ్యతరగతి నేపథ్యం ఉన్న విద్యార్థులకు సామాజిక-ఆర్థిక సవాళ్లపై లోతైన అవగాహన ఉంటుందని, ఆ అనుభవాలకు సాంకేతికతను జోడించి అర్థవంతమైన ఆవిష్కరణలు చేయవచ్చని పేర్కొన్నారు. అనంతరం ఎంసీఏ విభాగాధిపతి డాక్టర్ ఎం. జయంతి మాట్లాడుతూ.. పాఠ్య ప్రణాళిక, సిలబస్, ప్లేస్‌మెంట్ వివరాలను వెల్లడించారు. ఎడ్యునెట్, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రత్యేక వర్క్‌షాప్‌లు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హరీష్ కుమార్, ప్రొఫెసర్ సాంబశివరావు, డీన్ ఆచార్య రేఖ, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్ డాక్టర్ డి. సంధ్యారాణి, డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ సుధారాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ జి.ఉపేందర్ రెడ్డిలతో పాటు పలువురు అధ్యాపకులు, నూతన విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also Read : ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్య.. కులం వేధింపులే కారణమా?
Follow Us On: X(Twitter)

