రైతుల సమస్యలపై బీజేపీ కీలక కార్యాచరణ.. ఈనెల 27న భారీ యాత్ర!

కలం, నిజామాబాద్ బ్యూరో: బీజేపీ నిజామాబాద్ (Nizamabad) జిల్లా పార్టీ కార్యాలయంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పి. తిరుపతి రెడ్డి అధ్యక్షతన సైకిల్ యాత్ర సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు దినేష్ పటేల్ కులాచారి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా దినేష్ పటేల్ కులాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆ హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆదేశాల మేరకు బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీ సైకిల్ యాత్ర (Farmers Cycle Yatra) ను ఈ నెల 27వ తేదీన ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. బోధన్ నుండి ప్రారంభమై, అక్టోబర్ 4వ తేదీన జగిత్యాల వరకు దాదాపు 180 గ్రామాల మీదుగా కిసాన్ మోర్చా సైకిల్ యాత్ర కొనసాగుతుందని వెల్లడించారు.

సైకిల్ యాత్ర ప్రధాన డిమాండ్లు
  • షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలి.
  • కౌలు రైతులకు కూడా రైతు భరోసా వర్తింపజేయాలి.
  • అన్ని రకాల వడ్లకు బోనస్ అందించడంతో పాటు, మేనిఫెస్టోలో పేర్కొన్న 10 రకాల పంటలకు బోనస్ చెల్లించాలి.
  • వ్యవసాయ రైతు కూలీలకు సంవత్సరానికి రూ. 12,000 ఆర్థిక సాయం అందించాలి.
  • పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రాష్ట్రంలో అమలు చేయాలి.
  • నిజామాబాద్ నగరంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం వెంటనే స్థలం కేటాయించాలి.
  • నిజాం షుగర్ ఫ్యాక్టరీ (బోధన్), ముత్యంపేట్ చక్కెర కర్మాగారాలను తెరిపించాలి.
  • రైతు ఉత్పత్తిదారుల సంఘాలకు (FPO) తగిన ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందించాలి.

రైతుల హక్కుల సాధన కోసం చేపడుతున్న ఈ సైకిల్ యాత్రలో అన్నదాతలు, పార్టీ శ్రేణులు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కిసాన్ మోర్చ నాయకులు వెల్మ గంగారెడ్డి, అంతిరెడ్డి హరీష్ రెడ్డి, తోట చిన్నయ్య, జిల్లా పదాధాకారులు, కిసాన్ మోర్చ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>