చింతకుంట కెనాల్ వద్ద ఉద్రిక్తత.. బీజేపీ ధర్నాతో ఎస్సారెస్పీ నీళ్లు విడుదల!

​కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) శివారులోని చింతకుంట కెనాల్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గణేష్ నిమజ్జనానికి SRSP కెనాల్ (Chintakunta Canal) ద్వారా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, బీజేపీ నేతల ఆందోళన, నిరసనల పట్ల ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం నిమజ్జనానికి నీటిని విడుదల చేయడంతో పోరాటం ఫలించింది.

​పోలీసులు, బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణ:

చింతకుంట కెనాల్ (Chintakunta Canal) వద్ద ధర్నాకు దిగిన బీజేపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసే క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి రణరంగంగా మారింది. ఈ దాడిలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్‌పై పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించారని బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏసీపీ విజయ్ కుమార్, కొత్తపల్లి సీఐ కోటేశ్ ప్రవర్తించిన తీరుపై నాయకులు మండిపడ్డారు.​ పోలీసులు కార్యకర్తలను బలవంతంగా గుంజుకెళ్తూ కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు తదితరులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ప్రభుత్వ వైఖరిపై నేతల తీవ్ర ఆగ్రహం:

అరెస్టు సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ.. “హిందూ పండుగలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చులకన? అర టీఎంసీ నీటిని అడిగితే లాఠీలతో కొట్టిస్తారా? నీళ్లు వదిలేదాకా మా ఉద్యమం ఆగదు” అని స్పష్టం చేశారు. కరీంనగర్ డిప్యూటీ మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ.. “మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ, హుజూర్ నగర్‌లకు నీళ్లను తరలించుకుపోతూ కరీంనగర్‌కు అన్యాయం చేస్తున్నారు. నగర పాలక సంస్థ అన్ని ఏర్పాట్లు చేసినా ప్రభుత్వం నీళ్లు ఇవ్వకపోవడం దారుణం. నిమజ్జనానికి నీళ్లివ్వకుంటే కాంగ్రెస్‌ను రాజకీయంగా నిమజ్జనం చేయడం ఖాయం” అని హెచ్చరించారు. అలాగే బోయినిపల్లి ప్రవీణ్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ నేతల వైఖరిని తీవ్రంగా నిరసించారు. కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేయడం హేయమైన చర్యని అభివర్ణించారు.

​ఫలించిన పోరాటం – 500 క్యూసెక్కుల నీరు విడుదల:

బీజేపీ నేతల ఆందోళన, నగరంలో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం దిగివచ్చింది. గణేష్ నిమజ్జనం కోసం SRSP నుండి నీటిని విడుదల చేయాలని నిర్ణయించింది. ప్రాథమికంగా 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు, సాయంత్రానికి మరో 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ జలాలు రేపు రాత్రికి చింతకుంట కెనాల్‌కు చేరుకోనున్నాయి. నీటి విడుదలతో నగర ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read : సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలి: మంత్రి ఉత్తమ్‌

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>