కరీంనగర్‌లో అంతర్రాష్ట్ర ముఠాల హల్‌చల్.. భయాందోళనలో ప్రజలు!

కలం, కరీంనగర్ బ్యూరో: అంతర్రాష్ట్ర దొంగల ముఠాలకు, నేరగాళ్లకు కరీంనగర్ జిల్లా (Karimnagar Crimes)  ప్రధాన అడ్డాగా మారింది. కొన్ని నెలలుగా జిల్లాలో వరుసగా దోపిడీలు, చోరీలు సీసీ కెమెరాలకు చిక్కకుండా సాగుతుండడగా ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. “ పోలీసు నిఘా ఉందా? లేక నిద్రమత్తులో జోగుతోందా? ” అని ప్రజలు ప్రశ్నించే పరిస్థితి తలెత్తింది.

ఇటీవల వరుస నేరాలను పరిశీలిస్తే సాధారణ చోరీలను స్థాయి దాటి అంతర్రాష్ట్ర ముఠాలు టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. గత మే 3న కరీంనగర్ సిటీలోని పీఎంజే జువెలరీ షోరూమ్‌లోకి కస్టమర్లుగా వెళ్లిన దొంగలు కాల్పుల జరిపి నగలు ఎత్తుకెళ్లిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. బిహార్‌ గ్యాంగ్‌స్టర్ సుబోధ్ సింగ్ ముఠా రెండు నెలలు రెక్కీ చేసి దోపిడీకి పాల్పడిందని పోలీసులు తేల్చారు. అయితే.. ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకోకపోగా.. బంగారం సైతం రికవరీ చేయలేకపోయారు. ఇంటెలిజెన్స్ నిఘా వైఫల్యమేనని విమర్శలు ఉన్నాయి.

ఆయుధాలతో ఇంట్లోకి చొరబడి

భగత్ నగర్‌కు చెందిన అజ్మత్ అలీ ఇంట్లో అర్ధరాత్రి వేళ దొంగల ముఠా చొరబడి హల్ చల్ చేసింది. కుటుంబ సభ్యులను కట్టేసి కొట్టి, తుపాకులు, కత్తులతో బెదిరించి 66 తులాల బంగారం, రూ. 20 లక్షల నగదు, 10 తులాల వెండితో పాటు వాహనాలను ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులే చోరీ చేశారని పోలీసులు ఆలస్యంగా నిర్దారించినప్పటికీ పోయిన సొత్తును రికవరీ చేయలేదని సమాచారం. తాజాగా గంగాధరలో తాళం వేసిన ఇండ్లలో వరుస చోరీలు కలకలం రేపాయి. అక్కడి ప్రజలు రాత్రి అయితే భయాందోళనతో వణికిపోతున్నారు.

చొప్పదండి ఎస్బీఐలో చోరీ

చొప్పదండి ఎస్‌బీఐలో చోరీ దోపిడీగానే కాక, జాతీయ దర్యాప్తు సంస్థ విచారణలో ఉగ్రవాద నిధుల సేకరణ కోణం వెలుగులోకి రావడం స్థానిక పోలీసుల నిఘా లోపాన్ని ఎత్తిచూపింది. కరీంనగర్ లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. చొప్పదండిలో బస చేసి రెక్కీ వేసిన దుండగులు దాదాపు రూ. 42 లక్షలు దోచుకెళ్లడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. వివిధ రాష్ట్రాల నుంచి ఆరా తీసి నిందితులను తీవ్రవాదులుగా పోలీసులు తేల్చడం మరింత టెన్షన్ కు దారి తీసింది.

రెండు ఏటీఎంల్లో హైటెక్ దోపిడీ

తాజాగా దుర్శేడు, తిమ్మాపూర్ ప్రాంతాల్లోని ఎస్‌బీఐ ఏటీఎంల్లో స్కార్పియోలో వచ్చిన దొంగలు 8 నిమిషాల్లోనే సీసీ కెమెరాలకు బ్లాక్ స్ప్రే కొట్టి, కేబుళ్లు కట్ చేసి గ్యాస్ కట్టర్లతో మెషీన్లను కట్ చేసి రూ. లక్షల్లో ఎత్తుకెళ్లడం దొంగల హైటెక్ స్కెచ్ కు నిదర్శనంగా నిలిచింది. ముఠా ఎక్కడిది? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. అంతర్రాష్ట్ర ముఠా పనేనా? అనే అనుమానాలు తలెత్తాయి. వినాయక చవితి నేపథ్యంలో ఉగ్రమూలాలు ఏమైనా ఉన్నాయా? శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చాన్స్ ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

నిఘా నిరూపయోగం

కరీంనగర్ సిటీలో పెరిగిన నేరాల వెనుక పోలీసుల నిఘా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే రక్షణ అని ప్రచారం చేస్తున్నప్పటికీ, సాంకేతిక లోపాలతో కెమెరాలు పనిచేయడం లేదు. సీసీ కెమెరాలు కేవలం పెట్టడం వరకే, ఆ తర్వాత వాటి పర్యవేక్షణ, కంట్రోలింగ్ పూర్తిగా కరువైందనే చర్చ నడుస్తోంది. రాత్రి వేళ పెట్రోలింగ్ గస్తీ కాగితాలకే పరిమితమవుతోందనే విమర్శలు ఉన్నాయి.

ఏటీఎంల్లో దోపిడీ ఘటనలో ఢిల్లీ సెంట్రల్ సెక్యూరిటీ రూమ్ నుంచి సమాచారం వచ్చినా పోలీసులు చేరుకునే సరికి దొంగలు తప్పించుకోవడంమే ఇందుకు ఉదాహరణ. కమ్యూనిటీ పోలీసింగ్ వ్యవస్థ దాదాపుగా మరుగునపడింది. ఇతర రాష్ట్రాల నుంచి ముఠాలు వచ్చి లాడ్జీల్లో బస చేయడం, ఆయుధాలతో రద్దీ సమయాల్లోనూ, పండుగల వేళల్లోనూ రెక్కీ చేస్తుండగా పసిగట్టడంలో ఇంటెలిజెన్స్ విఫలమవుతోంది. శాంతిభద్రతలను కాపాడి, ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ ఉన్నతాధికారులపైనే ఉంది. ఇకముందైనా పోలీసులు కంటితుడుపు చర్యలు కాకుండా కఠిన చర్యలతో దొంగల ముఠాలకు అడ్డుకట్టవేయాలని కరీంనగర్ ప్రజలు కోరుతున్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>