ఆసియా గేమ్స్: భారత ఎంఎంఏ ఫైటర్ వరుణ్ సన్యాల్ అవుట్!

కలం, స్పోర్ట్స్ : ఆసియా గేమ్స్‌లో భారత్‌కు చేదు అనుభవం ఎదురైంది. పురుషుల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) 77 కేజీల విభాగంలో పోటీపడాల్సిన భారత ఫైటర్ వరుణ్ సన్యాల్ (Varun Sanyal) టోర్నీ నుంచి నిష్క్రమించారు. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఆయనను వైద్యులు అన్‌ఫిట్‌గా ప్రకటించారు. లండన్, భారత్‌లలో శిక్షణ పొందిన 28 ఏళ్ల వరుణ్ సన్యాల్, చైనాలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించి ఈ టోర్నీకి అర్హత సాధించారు. ఆసియా ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానంలో ఉన్న ఆయన పతకంపై ఆశలు రేపారు. ఒలింపియన్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్‌ల నుంచి స్పూర్తి పొందిన వరుణ్, ప్రైమల్ స్పోర్ట్ అయిన ఎంఎంఏ వైపు ఆకర్షితులయ్యారు.

అయితే 77 కేజీల కేటగిరీకి సరిపోయేలా బరువు తగ్గడానికి ఆయన ఆహారం, నీళ్లు తీసుకోవడం తగ్గించారు. ఈ క్రమంలో సావునా సెషన్ ముగిసిన అరగంటకు ఆయనకు కళ్లు తిరగడం, కండరాల నొప్పులు రావడం ప్రారంభమైంది. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆయనకు తేలికపాటి డీహైడ్రేషన్ ఉందని నిర్ధారించారు. రక్త పరీక్షల్లో బీయూఎన్ స్థాయిలు కాస్త ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇంజెక్షన్లు లేదా ఇతర మందుల అవసరం లేదని, నోటి ద్వారా నీళ్లు, ఉప్పు తీసుకోవాలని సూచించారు.

తీవ్ర అనారోగ్య సమస్యలు లేనప్పటికీ వైద్యుల సలహా మేరకు ఆయన పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. దీనితో టోర్నీ ప్రారంభానికి ముందే ఆయన ప్రయాణం ముగిసింది. భారత్ నుంచి ఏకైక పురుష ఎంఎంఏ ఫైటర్‌గా వెళ్లిన వరుణ్ నిష్క్రమణతో, ఇక మహిళల 60 కేజీల విభాగంలో పోటీపడుతున్న సుచికా తరియాల్ హుడాపైనే భారత్ ఆశలు నిలిచాయి. ఇప్పటికే మంగోలియాకు చెందిన అల్తాన్‌చిమెగ్‌ను ఓడించి సుచిక పతకాన్ని ఖాయం చేసుకున్నారు. వరుణ్ నిష్క్రమణ భారత ఎంఎంఏ వర్గాలను తీవ్ర నిరాశకు గురిచేసింది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>