కలం, మామడ : మామడ మండలం తాండ్ర గ్రామంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను (Smart Ration Cards) కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరిరావు ఆదివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రజాపాలన కొనసాగిస్తోందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రేషన్ కార్డుల పంపిణీని పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అర్హులైన కుటుంబాలకు నూతన రేషన్ కార్డులు మంజూరు చేయడంతో పాటు దేశంలో ఎక్కడా లేని విధంగా స్మార్ట్ రేషన్ కార్డులను అందిస్తున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత సులభంగా చేరేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి, తాండ్ర గ్రామ సర్పంచ్ కస్తూరి భాస్కర్, ఉప సర్పంచ్ రాథోడ్ సూషేన్ తదితరులు పాల్గొన్నారు.

