కలం, సూర్యాపేట : సూర్యాపేట – ఖమ్మం రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం (Suryapet Accident) సంభవించింది. సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద వేగంగా వెళ్తున్న వోల్వో కారు అదుపుతప్పి రహదారి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు కారులో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. క్షణాల వ్యవధిలోనే మంటలు వాహనం నలుమూలలా వ్యాపించడంతో కారు లభ్యం కానంతగా పూర్తిగా దగ్ధమైంది.
ఈ విషాదకర ఘటన ఖమ్మం నుండి హైదరాబాద్ వైపు వెళ్తుండగా చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో మంటలు తీవ్రరూపం దాల్చడంతో డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తి బయటకు వచ్చే వీలులేక కారులోనే సజీవదహనమయ్యాడు. సమాచారం అందుకున్న సూర్యాపేట పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసుల ప్రాథమిక విచారణలో మృతుడిని ఖమ్మంలోని ప్రముఖ మమత హాస్పిటల్‌కు చెందిన న్యూరో సర్జన్ డాక్టర్ కాసకుర్తి జగదీష్ గా గుర్తించారు. ప్రతిభావంతుడైన వైద్యుడు ఈ రకంగా రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో ఆయన కుటుంబ సభ్యులు, మమత ఆసుపత్రి వర్గాలు, ఖమ్మం వైద్య రంగం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

