కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం-హైదరాబాద్ 365బీ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని పిల్లలమర్రి ఫ్లైఓవర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Suryapet Accident) చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఒక వోల్వో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ హృదయ విదారక ఘటనలో కారులో ఉన్న వ్యక్తి బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. మృతదేహ ఆనవాళ్ల ఆధారంగా మృతుడిని ఖమ్మం మమత ఆసుపత్రికి చెందిన ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కసుకుర్తి జగదీష్‌గా పోలీసులు గుర్తించారు.
ఈ ప్రమాదం ఉదయం 7.15 గంటల ప్రాంతంలో జరిగి ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. మంటల ధాటికి కారు నంబర్ ప్లేట్ పూర్తిగా కాలిపోవడంతో మొదట వాహన వివరాలు గుర్తించడంలో పోలీసులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో సమీప టోల్ ప్లాజాల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా సూర్యాపేట రూరల్ ఎస్ఐ ఎం. అనిల్ కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. డాక్టర్ జగదీష్ ఆకస్మిక మృతి పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

