ఖైరతాబాద్‌ ఉప ఎన్నికపై ఉత్కంఠ!

కలం, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడంతో అక్కడ జరిగే ఉప ఎన్నిక (Khairatabad By Election)పై ఉత్కంఠ నెలకొన్నది. కోర్టు తీర్పు కారణంగా బై ఎలక్షన్ తప్పదనే వాదన వినిపిస్తున్నది. కానీ ఈ తీర్పును సవాలు చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో అది తేలేంత వరకు ఉప ఎన్నిక జరగకపోవచ్చనే చర్చ కూడా మొదలైంది.

ఉప ఎన్నికే అనివార్యమైతే జూబ్లీహిల్స్ తరహాలో ఖైరతాబాద్‌లోనూ హోరాహోరీ పోరు ఉంటుందని.. భారీ స్థాయిలో ఖర్చు చేయక తప్పదని.. ఫోకస్ మొత్తం బైపోల్‌పైనే పెట్టాల్సి వస్తుందని.. పార్టీల్లో ఆందోళన నెలకొన్నది. మరోవైపు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో వెలువడే ఫలితం రానున్న రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా ప్రభావం చూపుతుందని, దాని ఎఫెక్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉంటుందనే అభిప్రాయం నెలకొన్నది.

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రసక్తే లేదంటూ దానం నాగేందర్ తొలుత ప్రకటించారు. కానీ ఆ మాట చెప్పిన గంటల వ్యవధిలోనే సుప్రీంకోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై త్వరలో విచారణ జరగనున్నది. ఇలాంటి పరిణామం చోటుచేసుకుంటుందనే అనుమానంతో బీజేపీ ముందుగానే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ ఫైల్ చేసింది.

దానం నాగేందర్ పిటిషన్‌పై వాదనలు వినే ముందు.. తమ వాదనలూ వినాలన్నది బీజేపీ తరఫున పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి. అనర్హత వేటు వేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత.. ‘‘సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రసక్తే లేదు. ఉప ఎన్నికకు రెడీ.. మళ్లీ పోరాడుతా.. మళ్లీ గెలుస్తా” అంటూ ధీమా వ్యక్తం చేసిన దానం నాగేందర్.. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడం వెనుక కాంగ్రెస్ పార్టీ సూచనలు ఉన్నాయా? లేదంటే దానంకే గెలుస్తాననే నమ్మకం లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశానని దానం నాగేందర్ చెప్పుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.

ద్విముఖమా? త్రిముఖమా?

జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో జరిగిన ఉప ఎన్నిక అన్ని పార్టీలనూ టెన్షన్ పెట్టింది. లీడర్ మొదలు కేడర్ వరకు అందరినీ ఇక్కడే మోహరించేలా చేసింది. సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ చేజార్చుకోవాల్సి వచ్చింది. అధికార పార్టీకే అన్ని అనుకూలతలూ ఉంటాయనే మెసేజ్ ఇచ్చింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో గెలుపు, ఓటమి సంగతి ఎలా ఉన్నా.. భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వస్తుందనే టెన్షన్ అటు అభ్యర్థిలోనే గాక ఇటు పార్టీల్లోనూ నెలకొన్నది. మరోవైపు సిట్టింగ్ స్థానం కోల్పోతే పార్టీని మరింత డ్యామేజ్ చేస్తుందన్నది బీఆర్ఎస్ భావన.

దానం నాగేందర్‌‌ను గెలిపించుకోవడం అనివార్యమనేది కాంగ్రెస్ ఆలోచన. ఈ రెండు పార్టీల్లో మరో రకమైన ఆలోచన కూడా ఉన్నది. ‘నేను గెలవకపోయినా ఫర్వాలేదు.. నా ప్రత్యర్థి మాత్రం గెలవొద్దు..’ అనే తీరులో ఈ రెండూ పరోక్షంగా బీజేపీ గెలుపు విషయంలో సహకారం ఇస్తాయనే టాక్ కూడా లోకల్‌గా వినిపిస్తున్నది. దీంతో ఉప ఎన్నిక తప్పనిసరి అయితే పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ద్విముఖమా? లేక మూడో పార్టీగా బీజేపీ ఎంట్రీతో త్రిముఖం అవుతుందా? అనేది ఉత్కంఠగా మారింది.

మజ్లిస్ మద్దతు కీలకం

ఖైరతాబాద్ సెగ్మెంట్‌లో సంపన్నులతో పాటు వీఐపీ ఓటర్లూ ఉన్నారు. జూబ్లీహిల్స్ (కొంత భాగం), బంజారాహిల్స్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్‌పేట్ వంటి ప్రాంతాల్లోని బస్తీలు కీలకం కానున్నాయి. భారీ ఎత్తున ఆర్థిక వనరులు, పార్టీ కేడర్‌‌ను మోహరించాల్సి ఉంటుంది. జూబ్లీహిల్స్ తరహాలోనే ప్రధాన పార్టీలకు విజయం ప్రతిష్టాత్మకం. ఏక కాలంలో బస్తీలు, హైటెక్ సొసైటీలను మేనేజ్ చేయడం పార్టీలకు ఛాలెంజ్.

పలు బస్తీల్లో మజ్లిస్ పార్టీకి బలం ఉండడంతో దాని మద్దతు కూడా కొన్ని చోట్ల నిర్ణయాత్మకం కానున్నది. ఈ ఉప ఎన్నికతో సత్తా చాటుకోవాలన్నది బీఆర్ఎస్ భావన. అధికారంలో ఉన్నందున ఇది ఒక సీటు గెలుపుగా కాక ప్రభుత్వ పాలనకు రెఫరెండం అనేది కాంగ్రెస్ ఆలోచన. అందుకే ఆరు నూరైనా ఖైరతాబాద్‌లో గెలుపు తనదేననే ధీమాను దానం నాగేందర్ వ్యక్తం చేస్తున్నారు. ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉండకపోతే ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల లాంఛనమే అయ్యేది.

ఎవరికి అడ్వాంటేజ్?

ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఫలితం త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలపైనా ప్రభావం చూపనున్నది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోతే.. ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదనే బీఆర్ఎస్ వాదన నెగ్గినట్టు అవుతుంది. బీఆర్ఎస్ ఓడిపోతే సర్కార్‌‌కు ప్రజల మద్దతు ఉన్నదనే మెసేజ్ వెళ్లినట్టు అవుతుంది. ఈ రెండూ కాకుండా ఉప ఎన్నికను బీజేపీ సీరియస్‌గా తీసుకుంటే దానికి అడ్వాంటేజ్‌గా మారుతుందా? అనే చర్చ కూడా పార్టీల మధ్య నడుస్తున్నది.

2014లో ఈ స్థానాన్ని బీజేపీ గెలుచుకున్నా, 2018లో సెకండ్ ప్లేస్‌లోకి వెళ్లింది. తాజగా 2023 ఎన్నికల్లో థర్డ్ ప్లేస్‌లోకి వెళ్లింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖైరతాబాద్ రిజల్ట్ ప్రభావం చూపనున్నందున సిటీ పాలిటిక్స్‌లో ఏ పార్టీ పైచేయి సాధిస్తున్నదనే అంశానికి లిట్మస్ టెస్టుగా మారనున్నది. బీఆర్ఎస్, బీజేపీలకు దీటైన అభ్యర్థులు లేరని లోకల్ పబ్లిక్‌లో ఉన్న జనరల్ మౌత్ టాక్ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశంగా మారుతున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>