కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ (VB-G RAM G) పథకం కింద విధులు నిర్వహిస్తున్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికుల వేతనాల చెల్లింపులపై అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. కార్మికులు తమ వేతనాలను క్రమం తప్పకుండా పొందేందుకు తప్పనిసరిగా e-KYC ప్రక్రియను పూర్తి చేసుకోవాలని స్పష్టం చేశారు. ఆధార్ ధృవీకరణ , అలాగే బ్యాంకు ఖాతాల అనుసంధాన ప్రక్రియ వేగవంతం కాకపోతే వేతనాల జమలో తీవ్ర జాప్యం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ ఇ-కేవైసీ నమోదు ప్రక్రియ రాష్ట్రంలో రేపటి నుంచే అధికారికంగా ప్రారంభం కానుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీ పరిధిలో మొత్తం 76,659 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అయితే, వీరిలో ఇప్పటివరకు కేవలం 79 మంది మాత్రమే e-KYC ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన కార్మికులందరూ నిర్దేశిత సమయంలోగా తమ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నూతన నిబంధన ప్రకారం, e-KYC పూర్తయిన కార్మికుల పేర్లు మాత్రమే రోజువారీ ‘e-మస్టర్’ జాబితాలో నమోదవుతాయి. దీని ఆధారంగానే వారి రోజువారీ హాజరును గణించి వేతనాలను లెక్కిస్తారు. ఒకవేళ e-KYC పూర్తిచేసుకోని పక్షంలో, కార్మికులు తమ రోజువారీ హాజరును నమోదు చేసుకునే అవకాశం కోల్పోతారు. అంతేకాకుండా, గతంలో పనిచేసిన రోజులకు సంబంధించిన పాత వేతన బిల్లులు కూడా నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు తేల్చిచెప్పారు.

