కలం, కరీంనగర్ బ్యూరో : బీఆర్ఎస్ నాయకుల రూ.లక్ష కోట్ల భూదోపిడీని తేల్చడానికి మూడేళ్ల సమయం పట్టిందా అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరూ దోస్తులని, అందుకే భూదోపిడీ వ్యవహారాన్ని కాలయాపన రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు.
సీఎం స్థాయి వ్యక్తి మనసు పెడితే మూడు గంటల్లో ఆధారాలన్నీ బయటకు తీయవచ్చని, కానీ ఢిల్లీలోని ఏఐసీసీకి ఈఎంఐలు కట్టుకోవడానికి, బేరసారాలు ఆడడానికే ఈ దోపిడీ అంశాన్ని కాంగ్రెస్ అడ్డుపెట్టుకుందన్నారు. కాంగ్రెస్ వద్ద నిజంగా ఆధారాలు ఉంటే తక్షణమే బయటపెట్టాలని, లేని పక్షంలో ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్లలో బీఆర్ఎస్ 8 వేల ఎకరాలు కబ్జా చేసిందనడానికి ఆధారాలు చూపిస్తే ఆ భూములను రక్షించి పేదలకు పంచుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు.
ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు :
కాంగ్రెస్ ప్రభుత్వంపై తీరుగుబాటు తప్పదని సంజయ్ హెచ్చరించారు. ఆరు గ్యారంటీలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగకుండా ఉండేందుకే అసెంబ్లీలో కాంగ్రెస్ నాటకాలాడుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, వారిపై నమ్మకం పోయిందని అన్నారు. మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే గణేశ్ నిమజ్జనోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయని, ప్రజలంతా భక్తిశ్రద్ధలతో ఉత్సవాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రశాంతమైన వాతావరణంలో వేడుకలు పూర్తయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని ఆయన (Bandi Sanjay) డిమాండ్ చేశారు
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సారెస్పీ కాలువలు, చెరువులు ఎండిపోయి వినాయక నిమజ్జనాలకు తీవ్ర అవాంతరం ఏర్పడుతోందని బండి ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తక్షణమే కాలువలకు నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో వినాయక విగ్రహాలను రోడ్లపైనే ఉంచాల్సి వస్తుందన్నారు. దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పరిస్థితి చేయిదాటక ముందే సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించాలని బండి కోరారు.

