నీళ్లు, కరెంట్ ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్.. రేవంత్‌పై కేటీఆర్ ఫైర్

కలం, వనపర్తి: రాష్ట్రంలో కరెంట్, సాగు నీటి జలాలు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కరెంట్ కోతలు ఉన్నాయని స్వయంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంగీకరించారని గుర్తుచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నిరంతరం నీటిని అందిస్తే, ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాన్ని నిర్లక్ష్యం చేసిందని అచ్చంపేట ఎమ్మెల్యే చెప్పారని కేటీఆర్ విమర్శించారు. ‘నీళ్లుండి నీళ్లు ఇవ్వలేరు, కరెంట్ ఉండి కరెంట్ ఇవ్వలేరు.. ఇంతకన్నా అసమర్థ ప్రభుత్వం దేశంలో ఉందా?’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.

కొల్లాపూర్‌ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి తండ్రి ఇటీవల మృతి చెందడంతో శనివారం ఆయన కుటుంబాన్ని కేటీఆర్‌ పరామర్శించారు. అనంతరం పెబ్బేరు మండలంలోని గుమ్మడం, చెలిమిల సబ్‌స్టేషన్లను సందర్శించి లాగ్‌ రిజిస్టర్లను పరిశీలించారు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరా పరిస్థితులపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెబ్బేరు మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

ఆరు గంటలే విద్యుత్‌ సరఫరా..

రైతులతో కలిసి రెండు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను పరిశీలించామని కేటీఆర్‌ తెలిపారు. వ్యవసాయానికి ఆరు గంటలకు మించి విద్యుత్‌ సరఫరా కావడం లేదని రైతులు తమ దృష్టికి తీసుకొచ్చారని చెప్పారు. లో ఓల్టేజీ, తరచూ విద్యుత్‌ కోతలతో మోటార్లు కాలిపోతున్నాయని రైతులు వాపోతున్నారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పాలమూరు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని కేటీఆర్‌ తెలిపారు. వరదల సమయంలో నీటిని మళ్లించి చెక్‌డ్యామ్‌లు, చెరువులను నింపినట్లు చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో 7 వేల మెగావాట్లుగా ఉన్న విద్యుత్‌ స్థాపిత సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు పెంచామని పేర్కొన్నారు.

‘ఏపీకి నీళ్లు.. తెలంగాణకు ఎందుకు రావు?..’

పోతిరెడ్డిపాడు, వెలిగొండ మార్గాల ద్వారా ఏపీకి 100 టీఎంసీల నీరు వెళుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. జూరాలకు ఎగువ నుంచి నీరు రావడం లేదని, అందువల్ల కాలువలకు నీటి విడుదల నిలిపివేశామని అధికారులు చెబుతున్నారని తెలిపారు. అదే సమయంలో ఏపీకి నీరు వెళ్తుంటే తెలంగాణకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంపులను తరచూ ఆన్‌, ఆఫ్‌ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని, పంపులు ప్రారంభించిన తర్వాత నిరంతరాయంగా నడపాల్సి ఉంటుందని అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం, జిల్లాలోనే రైతులు సాగునీరు, విద్యుత్‌ కోసం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని విమర్శించారు.

కృష్ణా జలాలపై ప్రణాళిక ఏదీ?..

కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగడం లేదని కేటీఆర్‌ ఆరోపించారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాలు తమ ప్రాజెక్టులపై ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నాయని అన్నారు. రూ.లక్ష కోట్ల వ్యయంతో ఆలమట్టి ఎత్తును మరో అయిదు మీటర్లు పెంచే అంశంపై కర్ణాటక ప్రభుత్వం చర్యలు చేపడుతోందని, ఇది భవిష్యత్‌లో పాలమూరుకు నీటి లభ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో పాలమూరు వాటా దక్కే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.

ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలి..

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజాతీర్పు కోరాలని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో అక్రమాలు జరిగాయని చెబుతున్న అధికార పక్షం.. వాటికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, జీవన్‌రెడ్డి, అలంపూర్‌ ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్‌, జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్‌, పార్టీ మండల అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>