కలం, నిజామాబాద్ బ్యూరో: కామారెడ్డి జిల్లాలో యూరియా బస్తాల మాయం కావడం కలకలం రేపుతోంది. పాల్వంచ మండలం ఫరీద్పేట (Faridpeta) గ్రామంలోని సొసైటీ గోదాము నుంచి 177 యూరియా బస్తాలు మాయమయ్యాయి. ఇటీవల గ్రామ రైతుల కోసం యాప్లో 2,334 యూరియా బస్తాలను సొసైటీ అధికారులు స్టాక్ చేశారు. అయితే వీటిలో 2,157 యూరియా బ్యాగులను రైతులకు పంపిణీ చేసినట్లుగా అధికారులు రికార్డులో నమోదు చేశారు. అయితే, యాప్లో స్టాక్ పెట్టిన చోట 177 బ్యాగులు తక్కువగా వచ్చాయి. ఆ స్థానంలో నో స్టాక్ అని చూపిస్తుండటంతో యాప్ ఓపెన్ చేసిన రైతులు షాకయ్యారు. యూరియా బ్యాగులు మాయంపై సొసైటీ అధికారులను నిలదీయగా.. పొంతన లేని సమాధానం ఇచ్చారు.
గతంలో కూడా ఇలాగే..
గతంలో కూడా మాచారెడ్డి సొసైటీ పరిధిలో వందలాది యూరియా బ్యాగులు మాయం అవడంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి ఇదే మండలంలో బస్తాలు కనిపించకుండా పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారి వెంటనే స్పందించి రైతులకు యూరియా బ్యాగులు సప్లై అయ్యేటట్లు చూడాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా బ్యాగులు మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై కొందరు రైతులను ఆరా తీయగా.. కొంతమంది అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రోద్బలంతోనే యూరియా బస్తాలు మాయం అవుతున్నాయని.. ఆన్లైన్లో స్టాక్ చేసిన యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని స్పష్టం చేస్తున్నారు.

