కలం, నల్లగొండ: టీయూడబ్ల్యూజే-ఐజేయూ ఆధ్వర్యంలో జర్నలిస్టులు చేపట్టిన ఇంటి స్థలాల సాధన దీక్షకు నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి (Kancharla Bhupal Reddy) పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ (Nalgonda) జిల్లాలో పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యపై సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా సమాజ సేవలో ఉన్న జర్నలిస్టులకు నేటికీ సొంత ఇంటి స్థలం లేకపోవడం అత్యంత బాధాకరమని కంచర్ల భూపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇతర జిల్లాల్లో జర్నలిస్టులకు స్థలాలు కేటాయించినప్పుడు, నల్లగొండలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే అధికార వర్గాల, ప్రభుత్వ కార్యక్రమాలను జర్నలిస్టులు పూర్తిగా బైకాట్ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలంతో పాటు ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 లక్షల చొప్పున కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. కలెక్టర్, జిల్లా మంత్రి మనసు పెడితే జర్నలిస్టుల ఇంటి స్థలాల ఫైల్ నిమిషాల్లో కదులుతుందని పేర్కొన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టుల స్థలాల ఫైల్ సిద్ధమైందని, అప్పటి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి వద్ద ఆ ఫైల్ ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ.. అన్ని సిద్ధంగా ఉన్నప్పుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడుసార్లు జిల్లాకు వచ్చినా జర్నలిస్టుల స్థలాల గురించి ఏమీ ప్రకటించకపోవడం శోచనీయమన్నారు.
జర్నలిస్టుల మధ్య ఐక్యత లేకపోతే సమస్య పరిష్కారం మరింత ఆలస్యమవుతుందని, అందరూ ఒకే వేదికపైకి వచ్చి పోరాటాన్ని ఉధృతం చేయాలని సూచించారు. జర్నలిస్టుల ఉద్యమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, జిల్లా మంత్రికి మెమోరాండం ఇచ్చేందుకు కూడా వారితో రావడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, మాజీ గ్రంథాలయ సంస్థల చైర్మన్ రేగట్ట మల్లికార్జున్ రెడ్డి, 30వ వార్డు ఇన్ఛార్జ్ షేక్ జహంగీర్ బాబాతో పాటు పలువురు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొని జర్నలిస్టుల దీక్షకు మద్దతు తెలిపారు.

