కలం, నిజామాబాద్ బ్యూరో: గ్రామ పంచాయతీల్లో చెక్ పవర్ కోసం పవర్ పంచాయితీ నడుస్తోంది. సర్పంచ్ వర్సెస్ ఉప సర్పంచ్ గా మారింది. ఇరువురి మధ్య పంచాయితీ ముదురుతోంది. ఇప్పటికే చెక్ పవర్ పై సర్పంచ్ లు (Sarpanch Cheque Power) ఆందోళనలు నిర్వహిస్తున్నారు. పంచాయతీ అభివృద్ధి నిధుల డ్రాపై సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ గా సంతకం చేస్తేనే బిల్లులు మంజూరయ్యే పరిస్థితి ఉంది. ఇది కాస్త సర్పంచ్ లు ఉప సర్పంచ్ ల మధ్య గొడవలకు దారితీసింది. మరోవైపు ప్రభుత్వం చట్ట సవరణ దిశగా అడుగులు వేస్తుండడంతో ఎలాంటి నిర్ణయం వస్తుందోననే ఆసక్తి నెలకొంది.
గతంలో సర్పంచ్, కార్యదర్శికి మాత్రమే చెక్ పవర్ ఉండేది. 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి తెచ్చిన తర్వాత కార్యదర్శి స్థానంలో ఉప సర్పంచ్‌కు చెక్ పవర్ కట్టబెట్టింది. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలోనే ఉప సర్పంచ్ లకు చెక్ పవర్ ఇవ్వడం వివాదానికి కారణమైంది. నిజామాబాద్ జిల్లాలో పంచాయతీల్లో పెండింగ్ బిల్లులకు సంబంధించి ఉప సర్పంచ్ లు చెక్కులపై సంతకాలు చేయకపోవడంతో సిబ్బంది వేతనాలతో పాటు విద్యుత్ బిల్లులు, ట్రాక్టర్ ఈఎంఐలు, అభివృద్ధి పనుల బిల్లుల చెల్లింపులు ఆగిపోతుండగా.. ఇప్పటికే జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదులు కూడా వెళ్లాయి.
సంతకం చేయకపోయినా.. కానీ..
సర్పంచ్ సంతకం చేసి ఉప సర్పంచ్ చేయకపోతే వారం రోజుల సమయం దాటిన తర్వాత ఆ బిల్లులను కలెక్టర్ నేరుగా ఆమోదించే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. లేదంటే.. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకపోతే గ్రామసభ ద్వారా ఆమోదించి బిల్లులను మంజూరు చేసేందుకు కూడా పరిశీలిస్తోంది. అయితే సర్పంచ్ ల అవినీతిని అడ్డుకోవడంతో పాటు తమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం చూడాలని జాయింట్ చెక్ పవర్ ను కొనసాగించాలని ఉప సర్పంచ్ లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మండల అభివృద్ధి సమావేశానికి సర్పంచ్ లతో పాటు ఉప సర్పంచ్ లను కూడా ఆహ్వానించాలని, గౌరవ వేతనం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సర్పంచ్ల ఆందోళన బాట
నిజామాబాద్ జిల్లాలో 545 పంచాయతీలు ఉండగా.. ఎనిమిది నెలలుగా బిల్లులు మంజూరుకాకపోవడంతో గ్రామ పాలన అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల జిల్లా సర్పంచ్ ల ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట సర్పంచ్ లు ధర్నా నిర్వహించి ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఉప సర్పంచ్ లు సైతం తమకు తగిన హోదా ఇవ్వాలని, చెక్ పవర్ ను కొనసాగించాలని గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
పరిష్కారానికి సర్కార్ దృష్టి
సర్పంచ్, ఉప సర్పంచ్ మధ్య వివాదాలకు కారణమైన జాయింట్ చెక్ పవర్ పై ప్రభుత్వం పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఉప సర్పంచ్ ల చెక్ పవర్ రద్దుచేయాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క తీసుకెళ్లినట్లు సమాచారం. అసెంబ్లీ సమావేశాల్లో పంచాయతీరాజ్ చట్ట సవరణపైనా మంత్రి మాట్లాడారు. అయితే రాజకీయ పరంగా సర్పంచ్ లకే చెక్ పవర్ ఇస్తే భవిష్యత్తులో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా అనే కోణంలోనూ ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. సర్పంచ్ లకు చెక్ పవర్ ఇస్తే ఉప సర్పంచ్ ల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని కూడా భావిస్తోంది. దీంతో పరిష్కారం విషయమై దృష్టి సారించింది. ఈ వివాదం త్వరలోనే ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

