కలం, చంద్రుగొండ: ఆమెకు మాటలు రాకపోవచ్చు.. సమాధానాలు చెప్పలేకపోవచ్చు. కానీ, గ్రౌండ్లోకి దిగితే.. సాధించే విజయాలు జేజేలు కొట్టిస్తున్నాయి. వైకల్యం అనేది శరీరానికే కానీ పట్టుదలకు కాదని నిరూపిస్తోంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన సయ్యద్ సుమయ మరోసారి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. మహమూద్ కుమార్తె అయిన సుమయ ప్రస్తుతం చంద్రుగొండ (Chandrugonda) జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వినికిడి, మూగ వైకల్యాన్ని అధిగమిస్తూ క్రీడల్లో రాణిస్తూ ముందుకు సాగుతోంది.
గతంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన దివ్యాంగుల రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో రన్నింగ్, షాట్‌పుట్ విభాగాల్లో రాష్ట్రస్థాయి రన్నరప్‌గా నిలిచి సత్తా చాటింది. దీంతో భద్రాద్రి జిల్లా CMO/IE కోఆర్డినేటర్ తుమ్మలపల్లి రామారావు, చంద్రుగొండ మండలం IERP శుభాకర్ అండగా నిలిచారు. తాజాగా జరిగిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీల్లో చంద్రుగొండ మండలానికి చెందిన పలువురు విద్యార్థులు కూడా విభిన్న విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు.
రన్నింగ్, షాట్‌పుట్, డిస్కస్ త్రో తదితర విభాగాల్లో సాయినీ యశ్వంత్, కాకాటి సంతోశ్ కుమార్, నున్న ఇషాన్ నంద్, పష్టం అఖిల్, నాగ స్వాతిక, చింతల కావ్య, ఉమా కార్తికేయ రెడ్డి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వైకల్యాన్ని జయించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించిన సుమయతోపాటు మిగతా క్రీడాకారులకు జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు, విద్యార్థులు శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే రాష్ట్రస్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి జిల్లాకు మరిన్ని పతకాలు తీసుకురావాలని కోరారు.

